కరోనా గడ్డుకాలం ఇంకెంతకాలమో ?
కరోనా ప్రభావం ఎంతకాలం ఉంటుందన్న దానికి సమాధానం లేకుండా పోయింది. ప్రపంచవ్యాప్తంగా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరగడం ఆందోళన కలిగింస్తోంది. ఒమైక్రాన్ కొత్త వేరియంట్ విజృంభణతో మళ్లీ ఆంక్షల దిశగా అనేక దేశాలు పయనిస్తున్నాయి. ప్రపంచ దేశాల మధ్య రాకపోకలు ఇప్పటికే స్తంభించాయి. కొన్ని దేశాలు పట్టణాల మధ్యరాకపోకలను కూడా నిషేధించాయి. అంతర్గత విమాన సర్వీసులను రద్దు చేశాయి. అంతర్జాతీయ విమనాశ్రయాలన్నీ జనాలు లేక బోసిపోతున్నాయి. మరోమారు ప్రపంచం స్తంభిస్తే ఉత్పత్తి పడిపోవడం, వస్తు వినియోగం పెరిగే ప్రమాదం ఉంది. ముఖ్యంగా భారత్ లాంటి దేశాలు అతలా కుతలం అవుతున్నాయ. ఇక విదేశాల నుంచి వస్తున్న వారి కారణంగానే మనదేశంలో ఒమైక్రాన్ కరోనా సంఖ్య పెరుగుతోంది. కరోనా తీవ్రత కారణంగా మార్కెట్ల పతనం కొనసాగుతోంది. అయినా డాలర్‌తో రూపాయి మారకం విలువ మాత్రం తగ్గడం లేదు. ఇది కూడా మన ఆర్థిక వ్యవస్థకు భారంగానే చూడాలి. ఇప్పటికే వ్యాపార, వాణిజ్యాలు మొత్తం దెబ్బతింటున్నాయి. చిరు వ్యాపారులు ఆదాయం లేక చితికి పోతున్నారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావడం ఇష్టం లేక ..గత్యంతరం లేక యధావిధిగా తమ జీవనా ధారం కోసం పనుల్లో దిగక తప్పడం లేదు. రానున్న రోజుల్లో పెట్రోల్,డీజిల్ ధరుల అందుబాటులో ఉంటాయా లేదా అన్న భయాందోళనలో ప్రజలు ఉన్నారు. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు స్వారీ చేస్తున్నాయి. కరోనా కారణంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి ప్రవేశించింది. దీంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాలు తీవ్రరూపం దాల్చాయి. అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లు కుదేలు కాగా మన మార్కెట్లు సైతం అదే బాటలో నడిచాయి. అంతర్జాతీయంగా ఈక్విటీ, చమురు మార్కెట్లు కుప్పకూలాయి. ఎన్ని ఉద్దీపనలు ప్రకటించినా కానీ, కరోనా ప్రతాపంతో ప్రపంచ వృద్ధి రేటు దారుణంగా పడిపోవచ్చన్న భయాలతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకు పోటీపడుతున్నారు. కరోనాతో ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగరేటు పెరిగిపోతుంది. అంతర్జాతీయ మాంద్యం తప్పదంటూ రేటింగ్ ఏజెన్సీల హెచ్చరికలతో మార్కెట్లు నష్టపోతున్నాయి. కరోనా ప్రభావం ఉపాధి, ఉద్యోగుల పనిగంటలు, వేతనాల కోతలకు దారితీయవచ్చని ఇప్పటికే అనుభవంలోకి వచ్చింది. కరోనా నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి ప్రవేశించే అవకాశాలు కనిపిస్తుండడం ఆర్థిక సంక్షోభానికి కారణం కావచ్చు. మొత్తంగా కరోనా భయాల నేపథ్యంలో పెట్టుబడులకు సంబంధించి అంతర్జాతీయంగా ఇన్వెస్టర్ల భయాందో ళనలు కొనసాగుతున్నాయి. కొత్త వేఇయంట్ ఒమైక్రాన్ కరోనా వ్యవహారం ఎంతవరకు దారితీస్తుందన్న దానికి సమాధానం లేదు. దీంతో నిత్యావసర సరుకులు, రవాణకు మరింత గడ్డుకాలం రావచ్చన్న భయాలు మరోమారు వెన్నాడుతున్నాయి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న క్రమంలో కోవిడ్ కొత్తరకం ’ఒమిక్రాన్’ ప్రపంచ దేశాలను ఠారెత్తిస్తోంది. రెండేళ్ల క్రితం బయల్పడిన కోవిడ్`19 అతలాకుతలం చేయగా రెండవ ఉధృతిలో డెల్టా వేరియంట్ సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. ఆ ఉపద్రవం నుండి ప్రపంచం పూర్తిగా కోలుకోకమునుపే దక్షిణాఫ్రికాలో కొత్తగా కనుగొన్న బి.1.1.529 ఒమిక్రాన్‌తో కలకలం రేగింది. అసాధారణ మ్యుటేషన్ల కలయికగా ఒమిక్రాన్‌ను వైద్య పరిశోధకులు పేర్కొనడమే కాకుండా డెల్టా వేరియంట్ కంటే అత్యంత ప్రమాదకారి అని ప్రాథమికంగా నిర్దారించారు. దక్షిణాఫ్రికాలో గుర్తించిన ఒమిక్రాన్ స్వల్ప సమయంలోనే ఐరోపా దేశాలకు వ్యాపించింది. జర్మనీ, బ్రిటన్, ఇజ్రాయెల్, బాట్స్‌వానా, హాంకాంగ్, ఆస్టేల్రియాలలో ఒమిక్రాన్ కేసులు బయట పడ్డాయి. అప్రమత్తమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒమిక్రాన్‌ను ఆందోళనకర వేరియంట్‌గా ప్రకటించి అంతర్జాతీయ ప్రయాణాలపైన కఠిన ఆంక్షలు విధించాలని, వైరస్ కట్టడి చర్యలు చేపట్టాలని, వ్యాక్సినేషన్‌ను ముమ్మరం చేయాలని ఆదేశించింది. ఆగ్నే యాసియా దేశాలు మరింత అప్రమత్తంగా ఉండాలని దిశా నిర్దేశం చేసింది. అంతర్జాతీయ విమానాల రాక పోకలపై ఇప్పటికైతే అచేతనావస్థలోనే ఉంది. కోవిడ్ రెండవ దశ ఉధృతికి మోడీ ప్రభుత్వ అలసత్వమే కారణమన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. సెకండ్ వేవ్ సృష్టించిన విపత్తును తలచుకుంటేనే జనం వణికి పోతున్నారు. ఆక్సిజన్ లేమి, వైద్య సదుపాయాల కొరత, అరకొర టీకాలు ప్రజల ప్రాణాలకు భద్రత లేకుండా చేశాయి. ప్రతి రోజూ లక్షల్లో పాజిటివ్ కేసులు, వేలల్లో మరణాలు జనాన్ని వణికించాయి. తాజా వేరియంట్ అంత ప్రమాదకారి కాదని ఒకవైపు..జాగ్రత్తగా ఉండాలని మరోవైపు వస్తున్న హెచ్చరికల మధ్య ప్రజల జీవితాలను భయాందోళనలోకి నెడుతోంది. కోవిడ్‌తో కుటుంబాలకు కుటుంబాలనే పోగొట్టుకున్న అభాగ్యులకు ఎక్స్‌గ్రేషియా చెల్లించే విషయంలో కేంద్రం ససేమిరా అనడంతో సాక్షాత్తు సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నా..ముష్టి 50వేలు పొందడానికి కూడా నానా యాతన పడాల్సి వస్తోంది.ఇప్పుడు ఒమిక్రాన్ రూపంలో మూడవ ముప్పు పొంచి ఉందంటూ వెలువడుతున్న సంకేతాల నేపథ్యంలో సైతం కేంద్రం ప్రేక్షక పాత్ర వహించకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి.ప్రజలకు అండగా నిలవాలి. ఇప్పటికైతే ఒమిక్రాన్ వ్యాప్తి వేగం, అది కలిగించే తీవ్ర ఆరోగ్య లక్షణాలపై పరిశోధనాత్మకంగా నిర్దారణ కానప్పటికీ గతంలో ఎదురైన పరిణామాల రీత్యా ముందస్తు సన్నద్ధతకు కేంద్ర ప్రభుత్వం వేగంగా కదలాల్సిన అవసరం ఉంది. పోషకాహారం విషయంలోనూ, ఆకలి సమస్యలోనూ మన దేశం ఎక్కడో అట్టడుగున ఉందని ప్రపంచ స్థాయి ర్యాంకింగ్ సంస్థలు కుండబద్దలు కొట్టాయి. ప్రజల తలసరి ఆహార వినియోగం ఏడేళ్ల బిజెపి జమానాలో ఏకంగా తొమ్మిది శాతం తగ్గిపోయిందని ఎన్‌ఎస్‌ఎస్ సర్వే బట్టబయలు చేసింది. కరోనా వేరియంట్లను ఎదుర్కోవాలంటే ప్రజల్లో రోగ నిరోధక శక్తి ఉండాలి. కోట్లాది మంది ఆకలితో అలమ టిస్తున్న వేళ వారిలో ఇమ్యూనిటీని ఆశించడం వంచన. వ్యాక్సిన్ రెండు డోసులూ తీసుకున్న వారిలో సైతం ఈ ఒమిక్రాన్‌ను నిరోధించే శక్తి ఎంత ఉంటుందనేది ప్రశ్నార్ధకమని నిపుణులు అంటున్నారు. ఒమిక్రాన్ కట్టడిపై కేంద్రం రాష్టాల్రతో కలసి యుద్ధ ప్రాతిపదికన అప్రమత్తం కావాలి.