కర్ణాటకలో నకిలీ ఆర్టీ పీసీఆర్ సర్టిఫికెట్ ఉదంతం
కూపీ లాగి నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
బెంగళూరు,డిసెంబర్14 (జనంసాక్షి ): కర్ణాటకలో నకిలీ ఆర్టీ పీసీఆర్ సర్టిఫికెట్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఒమిక్రాన్ పాజిటివ్ వ్యక్తికి నకిలీ సర్టిఫికెట్ జారీ చేయడంతో అతను దేశం విడిచి వెళ్లినట్లు గుర్తించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రాగా.. కర్ణాటక పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. బెంగళూరులోని ఓ సాప్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్న ఇద్దరు ఉద్యోగులు సహా ఓ ప్రైవేట్ ల్యాబ్‌లోని ఇద్దరు సభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఈ వ్యక్తులు దక్షిణాఫ్రికా పౌరులకు నకిలీ ఆర్టీ పీసీఆర్ రిపోర్ట్ అందించారని ఆరోపిస్తున్నారు. భారత్‌లో తొలి ఒమిక్రాన్ కేసు బాధితుడు విదేశీయుడు కాగా.. నవంబర్ 20న దక్షిణాఫ్రికా నుంచి బెంగళూరుకు వచ్చాడు. విమానాశ్రయంలో అతనికి కరోనా సోకినట్లుగా గుర్తించారు. ఆ తర్వాత నమూనాలను సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపగా.. ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలింది. ఆ తర్వాత పౌరుడిని ఓ హోటల్‌లో క్వారంటైన్ చేశారు. సదరు వ్యక్తి తర్వాత నకిలీ ఆర్టీ పీసీఆర్ సర్టిఫికెట్ చూపించి.. దుబాయి విూదుగా
దక్షిణాఫ్రికా పారిపోయాడు. ఆ తర్వాత పోలీసులు సర్టిఫికెట్‌ను తయారు చేసిన ల్యాబ్‌ను ప్రశ్నించగా.. మొత్తం విషయం వెలుగులోకి వచ్చింది. సదరు వ్యక్తి 24 కాంటాక్టులను గుర్తించి వారికి కొవిడ్ పరీక్షలు చేయగా నెగెటివ్‌గా వచ్చింది.