కర్ణాటకలో ప్రభుత్వం మారుతుంది

– బీజేపీకి పట్టంకట్టేందుకు కన్నడ ప్రజలు ఆతృతగా ఉన్నారు
– దేశంలో ఏమూలన కూడా కాంగ్రెస్‌ విజయం సాధించలేదు
– దళితులకు కాంగ్రెస్‌ ఎప్పుడూ గౌరవం ఇవ్వదు
– సర్జికల్‌ స్టైక్స్ర్‌ను కాంగ్రెస్‌ నమ్మడం లేదు
– సైన్యానికి తుపాకులు కాకుండా కెమెరాలిమ్మంటారా?
– పాకిస్థాన్‌లో మరణించినవారి మృతదేహాలను చూసిఉండాల్సింది
– కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోడీ
– ప్రచారంలో దూకుడు పెంచిన మోడీ
– పదునైన వ్యాఖ్యలతో కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ ప్రధాని
బెంగళూర్‌, మే3(జ‌నం సాక్షి) : కర్ణాటకలో ప్రభుత్వం మారుతుంది.. బీజేపీకి పట్టం కట్టేందుకు కన్నడ ప్రజలు ఆసక్తితో ఎదురుచూస్తున్నారని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సవిూపిస్తున్న నేపథ్యంలో ప్రచారాల జోరు పెరిగింది. స్వయంగా రంగంలోకి దిగిన ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలోని కలబురగిలో గురువారం ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్‌ కర్ణాటక నుంచి బయటకు వెళ్లే దారిలో ఉందని వ్యాఖ్యానించారు. ఈసారి కర్ణాటకలో ప్రభుత్వం మారుతుందన్న మోడీ, దేశంలో ఏ మూలలో కూడా కాంగ్రెస్‌ ఇక విజయం సాధించలేదని పేర్కొన్నారు. ఈ ఎన్నికలు కర్ణాటక భవిష్యత్‌ను నిర్ణయిస్తాయిన్నారు. ఇది మహిళల భద్రత, రైతుల అభివృద్ధికి సంబంధించిన అంశమని, కేవలం ఎమ్మెల్యేలను ఎన్నుకోవడం మాత్రమే కాదని అన్నారు. ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి.. కానీ ప్రభుత్వం మారాలి అని ఇంత బలంగా కోరుకోవడం చూడడం ఇప్పుడేనని మోదీ అన్నారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఖర్గేను సీఎం చేస్తానంది.. కానీ హావిూని నిలబెట్టుకోలేదని విమర్శించారు. దళితులకు కాంగ్రెస్‌ గౌరవమివ్వదని ఎద్దేవాచేశారు. మన సైనికుల త్యాగాలకు కాంగ్రెస్‌ ఏమాత్రం గౌరవం ఇవ్వట్లేదని మోదీ దుయ్యబట్టారు. రైతులకు మద్దతు ధర ఇచ్చే అంశంలోనూ కర్ణాటకలో కాంగ్రెస్‌ అశ్రద్ధ చూపించిందని, స్వామినాథన్‌ కమిటీ నివేదికను కప్‌బోర్డులో పెట్టుకుందని మోదీ విమర్శించారు.
సైన్యానికి తుపాకులు కాకుండా కెమెరాలు ఇమ్మంటారా?
సైనికుల త్యాగాలను కాంగ్రెస్‌ గుర్తించడంలేదని దుయ్యబట్టారు. 2016లో భారత సైన్యం పాకిస్థాన్‌లోని ఆక్రమిత కశ్మీరులో నిర్వహించిన లక్షిత దాడులు (సర్జికల్‌ స్టైక్స్‌)ను కాంగ్రెస్‌ నమ్మడం లేదన్నారు. కాంగ్రెస్‌ నేతలకు రుజువులు కావాలంటే పాకిస్థాన్‌లో మరణించినవారి మృతదేహాలను చూసి ఉండవలసిందన్నారు. మన సైనికుల త్యాగాల పట్ల కాంగ్రెస్‌కు గౌరవం లేదన్నారు. మన సైన్యం సర్జికల్‌ స్టైక్స్‌ చేస్తే, సిగ్గు లేని కాంగ్రెస్‌ ఆ దాడులను ప్రశ్నించిందని ఎద్దేవా చేశారు. సర్జికల్‌ స్టైక్స్‌క్రు రుజువులు కావాలని అడుగుతున్నారన్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు ఒకరు ప్రస్తుత ఆర్మీచీఫ్‌ను ‘గూండా’ అని పేర్కొన్నారని తెలిపారు. సర్దార్‌ వల్లభ్‌ భాయ్‌ పటేల్‌ పేరు చెప్పేసరికి కాంగ్రెస్‌కు చెందిన ఓ కుటుంబానికి నిద్ర పట్టడం లేదన్నారు. స్వాతంత్య్ర సమరయోధులను, త్యాగధనులను అగౌరవపరచడం కాంగ్రెస్‌ స్వభావమని ఆరోపించారు. కర్ణాటక అంటే ధైర్యసాహసాలకు మారుపేరు అని, అయితే ఫీల్డ్‌ మార్షల్‌ కరియప్ప, జనరల్‌ తిమ్మయ్యలను కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఎలా చూశాయో అందరికీ తెలుసునన్నారు. దీనికి చరిత్రే సాక్ష్యమని చెప్పారు. 1948లో పాకిస్థాన్‌ను ఓడించిన తర్వాత జనరల్‌ తిమ్మయ్యను అప్పటి ప్రధాన
మంత్రి జవహర్లాల్‌ నెహ్రూ, రక్షణ మంత్రి కృష్ణ విూనన్‌ అవమానించారని చెప్పారు. రక్షిత దాడుల కోసం మన సైనికులు తుపాకీల కన్నా కెమెరాలు పట్టుకొని వెళ్ళాలని కాంగ్రెస్‌ కోరుకుంటుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఇంతకన్నా ఏమి ఆశించగలమన్నారు. వేదికపై ‘వందే మాతరం’ పాడుతున్న సమయంలో ఆ పార్టీ సీనియర్‌ నేత ప్రవర్తించిన తీరునుబట్టి ఆ పార్టీ నుంచి ఇంత కన్నా ఏవిూ ఆశించలేమన్నారు.