కర్ణాటకలో భాజపా అధికారంలోకి రాదు – సినీనటుడు ప్రకాశ్‌ రాజ్‌

– దక్షినాధిన వారి సిద్ధాంతాలు పనిచేయవు
కర్ణాటక, మే1(జ‌నం సాక్షి) : కర్ణాటక ఎన్నికల్లో భాజపా అధికారంలోకి రాదని విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ జోస్యం చెప్పారు. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో జోరుగా సాగుతున్న రాజకీయ పార్టీల ప్రచారంపై ఆయన విూడియాతో మాట్లాడారు. కర్ణాటకలో భాజపా అధికారంలోకి రావడమనేది కల్ల. విభజించి పాలించే అధికారాన్ని ఎవరూ కోరుకోరు. మనది ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ అందిరికీ చోటుంటుంది. స్వేచ్ఛ ఉంటుంది. ఏ మతానికో, కులానికో మన దేశం పరిమితం కాదు. దక్షిణ భారత దేశంలో భాజపా ఇక 
అధికారంలోకి రాదు. వారి సిద్ధాంతాలు ఇక్కడ పనికి రావన్నారు. మనదేశంలో ఉండే రాజకీయ పార్టీలన్నింటికీ సొంత నిర్ణయాలు, సిద్ధాంతాలు ఉంటాయని, కానీ ఒక్క భాజపా మాత్రం వేరొకరి సిద్ధాంతాల ప్రకారం నడుచుకుంటూ ఉంటుందని విమర్శించారు. మోదీ వారి పార్టీ నాయకులకు నోరు అదుపులో పెట్టుకోవాలని ఆదేశాలు జారీ చేశారని, దీన్ని నేను ఖండిస్తున్నానన్నారు. మోదీజీ… వారిని మాట్లాడనివ్వండి. భాజపా నేతలు ఎలాంటి వారో తెలుసుకోవడానికి ఉన్న ఏకైక అవకాశం ఇదే అని సూచించారు. వారి మనసులో ఏముందో తెలుస్తుందన్నారు. మోదీ భాజపా పార్టీ నేతల నోర్లు మూయించినా వారి వివాదాస్పద వ్యాఖ్యల పర్వం కొనసాగుతూనే ఉందన్నారు. భాజపా వర్గ రాజకీయాలు చేయడం లేదని నిరూపించమనండి..  ఈ ఛాలెంజ్‌కు నేను సిద్ధంగా ఉన్నానన్నారు. రాజకీయ నేతలు చెప్పే మాటలను బట్టి వారిని నమ్మద్దని, ఎన్నికల్లో ఇచ్చిన హావిూలను అమలు చేస్తేనే వారి మాట వినండి అని ప్రకాశ్‌రాజ్‌ ప్రజలకు సూచించారు. కర్ణాటకలో ప్రస్తుతం భాజపా చేస్తున్న ప్రచారం గురించి మాట్లాడుతూ…’భాజపాకు కర్ణాటక అంతగా కలిసిరాలేదు. ఇంతకుముందు అక్కడ అధికారంలోకి వచ్చిన యడ్యూరప్ప ప్రస్తుతం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతోపాటు మరికొందరు కీలక నేతలదీ ఇదే పరిస్థితి. మరి ఇక్కడ భాజపా అధికారంలోకి రావడానికి అవకాశమే లేదు’ అని అభిప్రాయపడ్డారు. కర్ణాటకలోని 224 అసెంబ్లీ స్థానాలకు గానూ ఈ నెల 12 ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ప్రచార పర్వం కొనసాగిస్తున్నాయి. ఈ ఫలితాలు మే 15న వెలువడనున్నాయి.
———————–