కర్ణాటక అభివృద్ధి కావాలంటే.. 

కాంగ్రెస్‌ను శిక్షించాలి
– హేమవతి నది ఉన్నా తాగునీటి కష్టాలు తప్పడంలేదు
– ఇరిగేషన్‌ రంగాల్లో ఎలాంటి పురోగతి లేదు
– రైతులు కష్టాలు పడుతుంటే కర్ణాటకలో మంత్రులు జేబులు నింపుకున్నారు
– అవినీతి, నల్లధనంపై పోరాటం చేస్తున్నాం
– బీజేపీ హయాంలో అవినీతికి తావు ఉండదు
– కాంగ్రెస్‌ – జేడీఎస్‌లు తోడు దొంగలు
– తుమకూరు బహిరంగ సభలో ప్రధాని మోదీ
బెంగళూరు, మే5(జ‌నం సాక్షి ) : కర్ణాటక రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిలో పయనించాలంటే కాంగ్రెస్‌ను శిక్షించాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ కన్నడ ప్రజలకు సూచించారు. మోదీ శనివారం ఉదయం తుమకూరులో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. కాంగ్రెస్‌ పార్టీని చిత్తుగా ఓడిస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. తుమకూరు ఎందరో మహానుభావులకు పుట్టినిల్లు అని, అలాంటి ప్రాంతంలో నేడు ప్రజలు తాగునీటి కరువుతో అల్లల్లాడుతున్నారన్నారు. పక్కనే హేమవతి నది ప్రవహిస్తోంది. కానీ, ఇక్కడి ప్రజలకు తాగు నీటిని అందించటంలో ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని మోడీ మండిపడ్డాడు.  30 ఏళ్లలో ఇరిగేషన్‌ రంగంలో ఎలాంటి పురోగతి లేకుండా పోయిందని విమర్శించారు. కానీ, ఈ నాలుగేళ్లలో మా హయాంలో ప్రాజెక్టులను నిర్మించి నీటి కష్టాలు తీర్చామన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి అవినీతి, నల్లధనం విూద ఉన్న ఆసక్తి అభివృద్ధి విూద లేదు. 70 ఏళ్లలో కాంగ్రెస్‌ ఏనాడూ రైతుల గురించి పట్టించుకోలేదన్నారు.  బంగాళాదుంపలు – బంగారం అంటూ మాట్లాడిన వాళ్లు(కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని ఉద్దేశిస్తూ) కూడా నేడు రైతుల గురించి మాట్లాటం హస్యాస్పదంగా ఉందన్నారు. ఓ పక్క రైతులు కష్టాలు పడుతుంటే కర్ణాటకలోని మంత్రులు మాత్రం తమ జేబులను నింపుకున్నారని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనతాదళ్‌ (సెక్యులర్‌), కాంగ్రెస్‌ పార్టీలు ఎన్నికల్లో వేర్వేరుగా పోటీ చేస్తున్నట్లు నటిస్తున్నాయని, కానీ అవి అంతర్గతంగా పొత్తు పెంటుకుంటున్నాయని మోదీ ఆరోపించారు. జేడీఎస్‌ తెర వెనుక కాంగ్రెస్‌ కోసం పనిచేస్తోందని, రాష్ట్రంలో కాంగ్రెస్‌ను కాపాడేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఇందిరాగాంధీ కాలం నుంచే కాంగ్రెస్‌ పార్టీ పేద ప్రజలను అమాయకుల్ని చేసి ఎన్నికల్లో గెలుస్తోందన్నారు. గతంలో ఆ పార్టీ చేసిన తప్పుడు
విధానాల వల్లే రైతులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ రైతులకు అబద్ధపు ప్రమాణాలు చేస్తోందని, వ్యవసాయ రంగాన్ని చాలా నిర్లక్ష్యం చేసిందన్నారు. కర్ణాటక అభివృద్ధి దిశగా వెళ్లాలనుకుంటే కాంగ్రెస్‌ను శిక్షించక తప్పదని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అవినీతి, నల్లధనంపై పోరాటం మొదలుపెట్టిందని, తాము అవినీతిని ఏమాత్రం సహించమని మోదీ అన్నారు. తుమకూరును స్మార్ట్‌ నగరంగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిధుల్ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. తాము సూక్ష్మ నీటిపారుదల ప్రాజెక్టులు, నీటి వనరుల అనుసంధానంపై పనిచేస్తున్నామని, ఇందులో కర్ణాటకలోని ప్రాజెక్టులు కూడా ఉన్నాయని మోదీ చెప్పుకొచ్చారు.