కర్ణాటక ఫలితాలు వూహించినవే: కిషన్‌రెడ్డి
హైదరాబాద్ : అవినీతికి వ్యతిరేకంగా నిలబడి, యడ్యూరప్పను పదవి నుంచి తప్పించినందుకే కర్ణాటక ఎన్నికల్లో ఓటమిపాలైనట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ఓటమిపాలైనా నిజాయతీగా వ్యవహరించినందుకు గర్వంగా ఉందన్నారు. ఈ ఫలితాలు వూహించినవేనని, రెండోసారి అధికారంలోకి వస్తామన్న అంచనా తమకు లేదని తెలిపారు. భాజపా సిద్ధాంతాన్ని ప్రజలు తిరస్కరించారన్న ప్రధాని వ్యాఖ్యలను కిషన్‌రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. అవినీతికి పాల్పడ్డ ముఖ్యమంత్రిని తొలగించి, భాజపా ప్రజలవైపు నిలబడిందని, కేంద్రంలో , రాష్ట్రంలో లక్షల కోట్ల కుంభకోణాల్లో కూరుకుపోయిన కాంగ్రెస్ నేతలకు భాజపాను తప్పుబట్టే నైతికహక్కు లేదని విమర్శించారు. ఇప్పటికే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తమ నాయకుడిగా చెప్పుకునే సీఎం , పీసీసీ చీఫ్ ఆయన బతికుంటే సీఎం పదవి నుంచి తప్పించవారా అని ప్రశ్నించారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో జగన్ అవినీతి కేసును పకడ్బందీగా దర్యాప్తు చేస్తున్న సీబీఐ… మన్మోహన్‌సింగ్, చిదంబరం ప్రమేయం ఉన్న బొగ్గు , 2జీ కుంభకోణాలను కూడా అంతే చిత్తశుద్ధితో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.