కర్నాటకలో ప్రభుత్వం నిలుపుకోవడం ముఖ్యం

మోడీని నిలువరించడం కోసం కాంగ్రెస్‌ ఎత్తులు
బెంగుళూరు,మే2( జ‌నం సాక్షి): కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం ఆ పార్టీకి అవసరం. మోదీ ఏకఛత్రాధిపత్యాన్ని గండికొట్టగలిగితే ఉత్తరాదిలో త్వరలో జరిగే ఎన్నికలకు కాంగ్రెస్‌కు బలం చేకూరుతుంది. అలాగే పార్టీకి కూడా  జీవన్మరణ సమస్య కానుంది.  కర్ణాటకలో ఉన్న ప్రభుత్వాన్ని కోల్పోతే కాంగ్రెస్‌ మరింత బలహీనపడుతుంది. అంతేగాకుండా రాహుల్‌ జాతీయ నాయకత్వంపై నీటినీడలు కమ్ముకుంటాయి.  తద్వారా రాష్ట్రాల్లో నాయకులు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవచ్చు. అందుకే రాహుల్‌ కూడా కార్నాటక ఎన్నికల్లో మరోమారు విజయం సాధించేలా శ్రమిస్తున్నారు.అనేకానేక కారణాల రీత్యా దేశమంతా ఇప్పుడు కర్ణాటకవైపు చూస్తున్నది. మరో వారంపాటు ఉధృత ప్రచారాల మధ్య కర్ణాటక ప్రజలు ఎవరివైపు మొగ్గుతారన్నది చూస్తున్నారు. గెలవకుంటే ఇతర రాష్టాల్లో బిజెపిని ఎదుర్కొనేందుకు ఆత్మవిశ్వాసం కోల్పోతుంది. ముఖ్యంగా రాహుల్‌గాంధీ నాయకత్వం ప్రశ్నార్థకం అవుతుంది. కాంగ్రెస్‌ గెలిస్తే దేశంలో ఇతర చోట్ల కూడా అది పుంజుకునేందుకు, ఇతరేతర శక్తులు, పార్టీలు ఆ పార్టీకి అండగా నిలిచి 2019లో మోదీని ఢీకొనేందుకు తగిన వాతావరణం ఏర్పడుతుంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 200 స్థానాలకు పైగా బిజెపికి కాంగ్రెస్‌ ముఖాముఖి పోటీనిచ్చినప్పటికీ నిలదొక్కుకోలేకపోయింది. కర్ణాటకలో
కాంగ్రెస్‌ గెలుపు ఈ 200 స్థానాల్లో బిజెపికి గట్టి పోటీనీయగల ఆత్మవిశ్వాసాన్ని సమకూరుస్తుంది.కర్ణాటకలో కాంగ్రెస్‌కు ప్రధాన అండ సిద్దరామయ్య మాత్రమే. ఆయన పాలనా దక్షతే రేపటి ఫలితాలకు గీటురాయి కాబోతున్నది. యడ్యూరప్ప గెలుపు కోసం మోదీ సర్వశక్తుల ఒడ్డినట్లుగానే  సిద్దరామయ్యకు రాహుల్‌ దగ్గరుండి ప్రచారం చేస్తున్నారు. అయితే అది ఎంతమేరకు తోడ్పడగలరనేది ప్రశ్నార్థకం. రాహుల్‌ కర్ణాటకలో మోదీ మాదిరి ప్రత్యేక ఆకర్షణ కాదు. యడ్యూరప్పకు బిజెపి ఇతర నాయకులు తోడయ్యారు. సూక్ష్మస్థాయి ఎన్నికల వ్యూహరచన కాంగ్రెస్‌ కూడా చేస్తున్నది.  కుల, మత, వర్గాల బలాలకు, భావోద్వేగాలకు అతీతంగా యడ్యూరప్ప గత అవినీత చరిత్ర పనిచేయడం, మోదీపై ప్రజల నమ్మకాలు చెరిగిపోవడంపైనే కాంగ్రెస్‌ గెలుపు ఆధారపడి ఉంది. సిద్దరామయ్య ప్రభుత్వంపట్ల వ్యతిరేకతను కూడా శాయశక్తులా ఉపయోగించు కునేందుకు బిజెపి ప్రయత్నిస్తోంది. పెద్దఎత్తున కేడర్‌ను దించి, క్రింది స్థాయి నుంచి పార్టీ నిర్మాణాన్ని పటిష్ఠంచేసి తమ ఓటు బ్యాంకును పెంచుకునేందుకు అవసరమైన ప్రతి చర్యా తీసుకుంటోంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌, కేంద్రంతో పాటు అనేక రాష్ట్రాల్లో బిజెపి అధికారంలో ఉన్నందువల్ల నిధులు ప్రవహించే అవకాశం ఉన్నది. కేంద్రమంత్రులందరూ కర్ణాటకలో మకాం వేసి విస్తృత ప్రచారం చేస్తున్నారు. రాజ్‌నాథ్‌ సింగ్‌, సుష్మాస్వరాజ్‌, ప్రకాశ్‌ జవదేకర్‌, పీయూష్‌ గోయెల్‌తో సహా  యోగీ ఆదిత్యనాథ్‌ పాటు అయిదారు మంది ముఖ్యమంత్రులు ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. నిజానికి మోడీ పరభంజనం ఉండివుంటే ఇంతగా బిజెపి శ్రమించాల్సి వచ్చేది కాదు. రాహుల్‌ను బచ్చాగా స్వీకరించడానికి సిద్దంగా లేరు. అందుకే హంగూ ఆర్భాటం చేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీతో పాటు మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజల దైనందిన జీవితాల్లో కల్లోలాన్ని సృష్టించాయి. గుజరాత్‌ లోనే వీటి ప్రభావాన్ని చూశాం. అందుకే బిజెపి  కర్ణాటకలో తప్పిదం చేయదల్చుకోలేదు.  సిద్దరామయ్య ప్రభుత్వం పట్ల ప్రజావ్యతిరేకతపై బిజెపి ఆశలు పెట్టుకున్నా, మోడీ వ్యతిరేకత ముందు సిదరదామయ్య బెటర్‌ అన్న ప్రచారం కూడా ఉంది. యెడ్యూరప్ప వ్యవహారంలో మోదీకి కర్ణాటక ఎన్నికల్లో అవినీతి గురించి మాట్లాడడం ఇబ్బందికరంగా మారింది. కర్ణాటకలో బిజెపి అధికారంలోకి రాగలిగితేనే మోదీ పట్టు నిలుస్తుంది.  అందుకే కాంగ్రెస్‌ కూడా కర్నాటకలో అధికరాం కోసం కన్నా మోడీని తుదముట్టించడమే లక్ష్యంగా పనిచేస్తోంది.