కర్నాటకలో రెచ్చిపోయిన దొంగల ముఠా

జాతీయ రహదారిపై సెల్‌ఫోన్ల లారీ చోరీ
బెంగళూరు,ఆగస్ట్‌7(జనంసాక్షి): కర్నాటకలో దొంగల ముఠా రెచ్చి పోయింది. కోలార్‌ లోని చెన్నై`బెంగళూరు జాతీయ రహదారి`75పై దొంగలు చెలరేగిపోయారు. కంటైనర్‌ లారీని అడ్డుకుని ఎంఐ ఫోన్లు చోరీ చేశారు. రూ.6.4 కోట్ల విలువైన సెల్‌ఫోన్లు దోపిడీ చేశారు. ఈ ఘటన ముళబాగిలు లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ?చైనా మొబైల్‌ కంపెనీ షావోమికి చెందిన ఎంఐ కంపెనీకి చెందిన మొబైల్‌ ఫోన్ల లోడ్‌తో పీజీ ట్రాన్స్‌పోర్ట్‌ కంటైనర్‌ లారీ గురువారం సాయంత్రం చెన్నై నుంచి బెంగళూరుకు వెళ్తోంది. అర్ధరాత్రి దాటిన తర్వాత కర్నాటకలోని ముళబాగిలు తాలూకా దేవరాయసముద్ర సవిూపంలోకి రాగానే కారులో వచ్చిన 8 మంది దుండగులు లారీని అడ్డగించి డ్రైవర్‌ ను తీవ్రంగా కొట్టారు. కేకలు వేయకుండా అతని నోట్లో గుడ్డలు కుక్కారు. తాళ్లతో కట్టేసి నిర్మానుష్యం ప్రాతంలో వదిలేసి రూ.6 కోట్ల విలువ చేసే సెల్‌ఫోన్ల లారీతో పరారయ్యారు. నేర్లహళ్లి వద్ద సెల్‌ఫోన్లను మరో లారీలోకి తరలించి తీసుకెళ్లారు. గతంలో కూడా ఓఎ ఫోన్ల లారీని దోపిడీ చేయడం గమనార్హం. తెల్లవారుజామున డ్రైవర్‌ కట్లు విప్పుకుని ముళబాగిలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలాన్ని పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డీఎస్పీ గోపాల్‌నాయక్‌ నేతృత్వంలోని బృందం దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టింది.

తాజావార్తలు