కర్నూలు జిల్లాలో విషాదం

మాజీ ఎమ్మెల్యే కుమారుడు ఆత్మహత్య

ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానం

కర్నూల్‌, జూన్‌15(జ‌నం సాక్షి ) : మాజీ ఎమ్మెల్యే తనయుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కర్నూలులో చోటుచేసుకుంది. బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పెద్ద కుమారుడు నాగార్జున రెడ్డి (28) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటీవలే బీటెక్‌ పూర్తిచేసిన నాగార్జున ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నారు. జూన్‌ 14 న బెంగళూరు నుంచి తండ్రి రామిరెడ్డితో కలిసి బనగానపల్లికి వచ్చాడు. గురువారం రాత్రి కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేసి అనంతరం తన గదిలో నిద్రపోయారు. శుక్రవారం ఉదయం ఎంత సేపటికీ బెడ్‌రూమ్‌ నుంచి అతడు రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. కిటికీలో నుంచి చూడగా నాగార్జున రెడ్డి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. ఈ దృశ్యాన్ని చూసి కుటుంబసభ్యులు హతాశులయ్యారు. లోపలి నుంచి గడియపెట్టడంతో కష్టంతో తలుపులు తెరిచి అతడిని కింద దించారు. చేతికందొచ్చిన చెట్టంత కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో కాటసాని రామిరెడ్డి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. నాగార్జునరెడ్డి ఆత్మహత్యకు దారితీసి కారణాలేంటో తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దీనికి ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. తల్లిదండ్రులు తన ప్రేమను నిరాకరించడం వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు భోగట్టా. గురువారం రాత్రి బెంగళూరు నుంచి తండ్రితో కలసి వచ్చిన నాగార్జున ఈ విషయంపై గొడవపడినట్లు సన్నిహితులు అంటున్నారు. ప్రేమ పెళ్లికి తండ్రి అంగీకరించలేదనే మనస్తాపంతో తన గదిలోకి వెళ్లాడని తెలిపారు. బనగానపల్లిలో నాగార్జున రెడ్డి ఆత్మహత్య వ్యవహారం కలకలం రేపుతుండగా, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించామని పోలీసు వర్గాలు వెల్లడించాయి.