కలహాలు,ఆర్థిక సమస్యలతో కుటుంబాలు ఛిద్రం
మిర్యాలగూడలో కుటుంబం ఆత్మహత్య
జగిత్యాలలో కూతుళ్లతో కలసి బావిలో దూకిన తల్లి
హైదరాబాద్,జులై24(జనంసాక్షి): ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నాయి. చిన్న కారణాలతో మూకుమ్మడి ఆత్మహత్యలకు పాల్పడడం కలకలంరేపుతోంది. తాజాగా మిర్యాలగూడలో, జగిత్యాలలో జరిగిన వేర్వేరు ఘటనలు కలకలం రేపాయి. సూర్యాపేట జిల్లాలోని మిర్యాలగూడలో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో తల్లి పారేపల్లి చిత్రకళ(40), కుమారుడు లోహిత్(12) మృతిచెందగా.. తండ్రి లోకేష్(45) పరిస్థితి విషమంగా ఉంది. అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యాయత్నానికి గల కారణంగా సమాచారం. ఆర్థిక సమస్యలు తాళలేక ఈ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని సంతోష్‌నగర్ కాలనీకి చెందిన పారేపల్లి లోకేశ్వర్, చిత్రకళ(37) దంపతులకు లోహిత్‌కుమార్(12), శ్రీ విఘ్నేశ్ అనే ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేసే లోకేశ్వర్ గత ఆరు నెలల క్రితం కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఉద్యోగం మానేశాడు. దీంతో వారి కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక మంగళవారం రాత్రి లోహిత్‌కుమార్‌తోపాటు దంపతులిద్దరూ పురుగుల మందు తాగారు. దీంతో చిత్రకళ, లోహిత్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. అయితే అపస్మారక స్థితిలో ఉన్న లోకేశ్వర్ హైదరాబాద్‌లో ఉంటున్న తన సోదరికి ఫోన్ చేయగా ఆమె వెంటనే లోకేశ్వర్ ఇంటి సవిూపంలో ఉంటున్న వారికి ఈ సమాచారాన్ని అందించింది. స్థానికులు వెళ్లి తలుపులు పగలకొట్టి లోకేశ్వర్‌ను ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇద్దరు కుమార్తెలతో తల్లి ఆత్మహత్య
జగిత్యాల జిల్లాలోని మల్యాల మండలం సర్వాపూర్‌లో విషాదం నెలకొంది. ఇద్దరు కుమార్తెలతో కలిసి ఓ తల్లి బావిలో దూకింది. దీంతో తల్లి, ఇద్దరు కుమార్తెలు మృతి చెందారు. మృతులను స్వప్న, అహల్యశ్రీ(3), విన్ను(నాలుగు నెలలు)గా పోలీసులు గుర్తించారు. స్వప్న భర్త నరేష్.. మల్యాలలో లేడీస్ ఎంపోరియం నిర్వహిస్తున్నాడు. లేడీస్ ఎంపోరియానికి వెళ్తున్నామని చెప్పి తన ఇద్దరు పిల్లలను తీసుకుని స్వప్న మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిపోయింది. షాపు వద్దకు వెళ్లకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా స్థానికంగా ఉన్న ఓ బావిలో స్వప్న, అహల్యశ్రీ, విన్నుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలి నివాసంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనకు కారణాలు ఏంటని ఆరా తీస్తున్నారు. కుటుంబ కలహాలపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.