కలెక్టరేట్ల నిర్మాణంపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

5

హైదరాబాద్‌,మే6(జనంసాక్షి): జిల్లా కేంద్రాల్లో కేంద్రీకృత కలెక్టర్‌ కార్యాలయాల నిర్మాణాలపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ సవిూక్ష నిర్వహించారు. కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆర్కిటెక్ట్‌లతో సవిూక్షించారు. 25 ఎకరాల విస్తీర్ణంలో కలెక్టర్‌ కార్యాలయాల నిర్మాణాలను చేపట్టాలని పేర్కొన్నారు. బహుళ అంతస్తుల సముదాయంలో కలెక్టర్‌ కార్యాలయాలు ఉండాలన్నారు. విశాలమైన గదులతో పూర్వపు బంగళాల తరహాలో నిర్మాణాలు చేపట్టాలని కోరారు.ఇదిలా వుండగా కొత్త జిల్లాల ఏర్పాటుపై ఆఖరి కసరత్తు మొదలైంది. తెలంగాణలో ఇప్పుడున్న పది జిల్లాలకు అదనంగా 14 లేదా 15 కొత్త జిల్లాల ఏర్పాటుకు సన్నాహాలు మొదలయ్యాయి. స్వయంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వచ్చే జూన్‌ రెండో తేదీన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొత్త జిల్లాలను ప్రకటిస్తామని వెల్లడించటం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. జిల్లాలతో పాటు రెవిన్యూ డివిజన్లు, మండలాల పునర్వవ్యస్థీకరణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.కొత్తగా ఏయే పట్టణాలు జిల్లాలుగా అవతరిస్తాయనేది అన్ని ప్రాంతాల ప్రజల్లో ఉత్కంఠ రేపుతోంది. వీటిపై కసరత్తుకు గత ఏడాది సెప్టెంబరులోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ సారధ్యంలో నలుగురు కార్యదర్శులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇప్పటికే తన తొలి నివేదిక సిద్ధం చేసింది. పరిపాలనా సౌలభ్యంతో పాటు భౌగోళికంగా ప్రజలకు అందుబాటులో ఉండే ప్రాంతాలను బట్టి కొత్త జిల్లాలు, వాటి సరిహద్దులుండేలా ప్రతిపాదనలు రూపొందించింది. ఈమేరకు కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం అధికారిక సన్నాహాలు పూర్తి చేసింది. గత ఏడాది నవంబరులోనే ఆంధ్రప్రదేశ్‌ డిస్ట్రిక్‌ ఫార్మేషన్‌ యాక్ట్‌-1974ను తెలంగాణ డిస్ట్రిక్‌ ఫార్మేషన్‌ యాక్ట్‌గా పరిగణిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

నేతల నుంచి పెరిగిన ఒత్తిడి:

కొత్త జిల్లాల ఏర్పాటును వీలైనంత తొందరగా పూర్తి చేయాలని సొంత ఎమ్మెల్యేలు, మంత్రులు కొంతకాలంగా సీఎంపై ఒత్తిడి పెంచారు. నియోజకవర్గాల పెంపు, కొత్త జిల్లాల ఏర్పాటుతో తమ తమ సెగ్మెంట్లు అటుదిటుగా మారిపోతే తమ రాజకీమ భవిష్యత్తుపై ప్రభావం పడుతుందని, అందుకే రాబోయే ఎన్నికలను దష్టిలో పెట్టుకొని ఈ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని వీరందరూ సీఎంను కోరుతున్నారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలో ప్రస్తుతమున్న అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను 119 నుంచి 153కు పెంచాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే కేంద్రానికి లేఖ రాసింది. దీంతో వీటికి అనుగుణంగానే రాష్ట్రంలో కొత్త జిల్లాలు అవతరిస్తాయనే ప్రచారం జరిగింది. కానీ నియోజకవర్గాల సంఖ్య పెంపు ఎప్పటిలోగా జరుగుతుందనే విషయంలో కేంద్రం నుంచి స్పష్టత లేదు. ఈలోగా జిల్లాల ఏర్పాటు ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం అనూహ్యంగా తెరపైకి తీసుకురావటంతో రాజకీయ శ్రేణుల్లో కలకలం మొదలైంది.

కరీంనగర్‌, వరంగల్‌తో పీటముడి:

ఎన్నికల ముందు, సీఎం ¬దాలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పలు ప్రాంతాలను కొత్త జిల్లా కేంద్రాలుగా ఏర్పాటు చేస్తామని అక్కడి ప్రజలకు వాగ్దానం చేశారు. దీంతో కొత్త జిల్లాల ఏర్పాటుపై పలుచోట్ల స్పష్టమైన సంకేతాలున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లాలో మంచిర్యాల, కరీంనగర్‌ జిల్లాలో జగిత్యాల, వరంగల్‌ జిల్లాలో భూపాలపల్లి, మెదక్‌ జిల్లాలో సంగారెడ్డి, సిద్ధిపేట, నల్లగొండ జిల్లాలో సూర్యాపేటను జిల్లాగా మారుస్తామని వివిధ సందర్భాల్లో సీఎం ప్రకటించారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో నాగర్‌కర్నూలు, వనపర్తి, ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం జిల్లాలుగా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు సర్కారు తుది పరిశీలనలో ఉన్నాయి. ఇప్పుడున్న రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాలను నాలుగు జిల్లాలుగా విభజించే ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. కొత్తగా వికారాబాద్‌, ఇబ్రహీంపట్నం, చార్మినార్‌, గోల్కొండ, సికింద్రాబాద్‌ జిల్లా కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావించారు. ఏయే ప్రాంతాలను ఏ జిల్లా పరిధిలో చేర్చాలనే విషయంలో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.

పాలమూరులో కొనసాగుతున్న దీక్షలు:

మరోవైపు వివిధ ప్రాంతాల నుంచి డిమాండ్లు తీవ్రస్థాయికి చేరాయి. వరంగల్‌ జిల్లాలో మహబూబాబాద్‌, జనగాంను జిల్లా కేంద్రాలుగా మార్చాలని స్థానికులు పట్టుబడుతున్నారు. ఇప్పటికే పలుమార్లు ఉన్నతాధికారుల కమిటీకి తమ అభ్యర్థనను అందించారు. ములుగు కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని అక్కడి ప్రజాప్రతినిధులు హైదరాబాద్‌కు వచ్చి సీఎస్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. మహబూబ్‌నగర్‌లో గద్వాలను కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలనే ఆందోళన కొనసాగుతోంది. ఇదే డిమాండ్‌తో ఏర్పడ్డ జేఏసీ మూడు నెలలుగా అక్కడ రిలే నిరాహార దీక్షలు చేపడుతోంది. మరోవైపు ఇబ్రహీంపట్నం, మేడ్చల్‌ కేంద్రాలను జిల్లాలుగా మార్చాలని రంగారెడ్డి ప్రాంత ప్రతినిధులు పట్టుబడుతున్నారు.

ప్రస్తుత జిల్లాలు.. కొత్త జిల్లాల ప్రతిపాదనలు

ఆదిలాబాద్‌: మంచిర్యాల

కరీంనగర్‌: జగిత్యాల

వరంగల్‌: భూపాలపల్లి

మెదక్‌: సంగారెడ్డి, సిద్ధిపేట,

మహబూబ్‌నగర్‌: నాగర్‌కర్నూలు, వనపర్తి

నల్గొండ: సూర్యాపేట

ఖమ్మం: కొత్తగూడెం

రంగారెడ్డి: వికారాబాద్‌, ఇబ్రహీంపట్నం, మేడ్చల్‌

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌, చార్మినార్‌, గోల్కొండ.