కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన లింగాల రైతులు
జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం నాగారం జిపి పరిధిలోని లింగాల చెరువు కట్ట నుండి జాలు నీరు, వర్షపు నీరు పారకం కాలువల ద్వారా పారుతూ వెళ్లి ఒర్రెలో కలుస్తాయి..కానీ కొందరు రైతులు అక్రమంగా పారకం కాలువల పక్కన బావులు తవ్వి, పారకం కాలువల్లో
మట్టిపోసి నీరు ఒర్రెలో కలువకుండా ఎగువ పొలాలు నీటిలో మునిగిపోయేలా కట్టలు కట్టినారు అని, చొప్పరి నారాయణ అనే రైతు మైనింగ్ శాఖ వద్ద అనుమతి తీసుకొని దాదాపుగా మూడు వందల ట్రిప్పుల చెరువు మట్టి పారకం కాలువకు అడ్డంగా పోసారని లింగాల రైతులు సోమవారం జిల్లా కలెక్టర్ కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఇతర రైతులకు ఇబ్బంది కలిగే విధంగా చెరువు మట్టి పోసి, అక్రమంగా చెరువు పారకం కాలువలు మూసి వేయడం జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. మట్టి తరలించే అవకాశం అనుమతులు కల్పించిన రెవెన్యూ శాఖ వారిని, మైనింగ్ శాఖ వారిని మూసివేసిన పారకం కాలువలు పునరుద్ధరించే విధంగా ఇరిగేషన్ శాఖ అధికారులను తగు చర్యలు తీసుకొని పొలాలు మునిగి పోకుండా కాపాడాలని రైతులు కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. అక్రమంగా పారకం కాలువలు మూసివేసిన రైతుల పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖ వారికీ విజ్ఞప్తి చేసి, ఇక ముందు ఇలాంటి చర్యలకు ఎవరు సాహసించకుండా తగు చర్యలు
తీసుకోవాలని లింగాల చెరువు కింది ఆయకట్టు రైతులు వినతి పత్రంలో కలెక్టర్ ను కోరారు.