కళాకారుడిగా మిద్దె రాములు తెలంగాణాకే తలమానికం
– చదువు రాకున్నా మిద్దె రాములు ప్రజల గుండెల్లో నిలిచాడు
– జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్
జనంసాక్షి, మంథని : అబద్దాలతో అధికారంలోకి వచ్చి ఈ ప్రాంత ప్రజల ఆకలి తీర్చకుండా కష్టాలు పట్టించుకోని మంథని ఎమ్మెల్యే మళ్లీ ఓట్లకోసం పల్లెనిద్రల పేరుతో పరేషాన్ చేసేందుకు వస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు. ప్రముఖ ఒగ్గు కథ కళాకారులు మిద్దె రాములు జయంతి ఉత్సవాల సందర్బంగా మంథనిలోని రేణుకా ఎల్లమ్మ ఆలయ సమపంలో పుట్ట లింగమ్మ ట్రస్టు ఆధ్వర్యంలో జయంతి వేడుకలను నిర్వహించి నియోజకవర్గంలోని కళాకారులను ఘనంగా సన్మానించి మెమోంటోలు అందజేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అథితిగా హజరై మాట్లాడుతూ.. ప్రజల్లో చైతన్యం రావాలన్నదే తన ఆరాటమని, ఆనాడు ఒగ్గు కధలతో ప్రజల్లో ఓ చైతన్యం తీసుకువచ్చిన ఘనత మిద్దె రాములుదేనన్నారు. కళాకారుడు మిద్దె రాములు తెలంగాణాకే తలమానికమని ఆయన అన్నారు. చదువుకోకున్నా ఉన్నత విద్యావంతుడిగా మిద్దె రాములు ప్రజల గుండెల్లో నిలిచిపోయారని, వేల సంఖ్యలో తన శిష్యులను తయారు చేసుకున్నారని, ఈనాడు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని ఆయన కొనియాడారు. ఇలాంటి మహనీయుల చరిత్రను గత పాలకులు దాచి పెట్టారని, మహనీయుల చరిత్రను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఆలోచన చేశామని, ఈ క్రమంలోనే అనేక మంది మహనీయుల విగ్రహాలను మంథనిలో నెలకొల్పామన్నారు. వంద ఏండ్ల క్రితమే మహనీయులు మన గురించి ఆలోచన చేసిన విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలన్నారు. ఈనాడు మనం చేసే ప్రతి పనికి ఒక అర్థం ఉంటుందని, దాని ఫలాలు మన తరాలు అనుభవిస్తాయని ఆయన అన్నారు. కళాకారులు ప్రతి ఒక్కరు ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు తమ వంతు సహకారం అందించాలని, ఓటు హక్కు వినియోగించుకునే ముందు ఆలోచన చేసే విధంగా కళాకారులు తమ కళలతో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కేవలం అధికారం, పదవుల కోసం ఆరాటపడే నాయకులకు కాకుండా ప్రజల ఆకలి కష్టాలను తీర్చే నాయకుడిని పాలకుడిగా ఎన్నుకునే ఆలోచన చేసేలా చైతన్యం తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. సమాజం మేల్కొల్పేలా ఎంతో మంది మహనీయులు తమ జీవితాలు త్యాగం చేశారని, ఆనాడు జ్యోతిబావు పూలే, సావిత్రీబాయి పూలే ఆలోచన చేసి ఉండకపోతే ఈనాడు అక్షరజ్ఞానం ఉండేది కాదని, అలాగే ఎంతో మంది మహనీయులు మన కోసం పోరాటం చేశారని ఆయన గుర్తు చేశారు. మహనీయుల స్పూర్తితో ప్రతి ఒక్కరుముందుకు నడువాలని ఆయన పిలునిచ్చారు. అనంతరం నియోజకవర్గంలోని ఒగ్గు కథ కళాకారులను ఆయన ఘనంగా సన్మానించి సత్కరించారు.