కళాకారులు పాటలో ఓటును చూపించాలి

– అంబేద్కర్‌ను అనుసరించాలని ఆలోచన చేసిన వ్యక్తి గద్దర్‌
– జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌
జనంసాక్షి, మంథని : ప్రజా చైతన్యం కోసం కళాకారులు ఆలపించే పాటలో ఓటును చూపించాల్సిన అవసరం నేటి సమాజంలో ఉందని బీఆర్‌ఎస్‌ పార్టీ మంథని ఎమ్మెల్యే అభ్యర్థి, పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ అన్నారు.
పెద్దపల్లి జిల్లా మంథని డివిజన్ కళాకారుల ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో చేపట్టిన ప్రజా యుద్దనౌక గద్దర్ సంతాప సభలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పుట్ట శైలజతో కలిసి ఆయన పాల్గొని గద్దర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆనాడు బానిసత్వం, ఆకలి తీర్చడం కోసం తుపాకి పట్టి అడవులకు పోయారని, అడవుల్లోని ఉంటూ ప్రజల్లో చైతన్యంతీసుకురావడానికి పోరాటం చేశారన్నారు. సమాజాన్ని మేల్కొల్పానే ఆలోచనతో జననాట్యమండలిని స్థాపించి ఆటాపాటలతో ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు గద్దర్‌ ఎంతో ప్రయత్నం చేశారని, కానీ చివరి సమయంలో తన ఆలోచనలు మార్చుకున్నారని అన్నారు. అట్టడుగు వర్గాలు అభివృద్ది వైపు పయనించాలనే ఆలోచనతో ఆనాడు రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌ అందించిన ఓటుతోనే సాధ్యమని గ్రహించిన గద్దర్‌ అంబేద్కర్‌ను అనుసరించాలని చేశారని, గోసి గొంగలిని వదిలి సూటు వేసుకుని అంబేద్కర్‌ ఆలోచనల బాట పట్టారని ఆయన అన్నారు. అయితే ఓటు విలువ తెలుసుకోకపోవడం మూలంగానే అనేక అనర్థాలు చోటు చేసుకుంటున్నాయని, ముఖ్యంగా మంథనిలాంటి ప్రాంతంలో ఓటు విలువ చెప్పకపోవడంతో ఇంకా బానిస సంకెళ్ల నడుమ ఉన్నామన్నారు. ఈనాడు కళాకారులు ప్రజా చైతన్యం కోసం పోరాటం చేయాలని, ఓటు విలువను చాటి చెప్పాలని ఆయన అన్నారు. బుల్లెట్‌ కంటే అత్యంత వేగమైన ఓటు విలువ తెలుసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఆ ఓటు మన తలరాతలు మార్చుతాయని గ్రహించాలన్నారు. మన ప్రతి రోజు మంచి చేయాలని దేవుడిని కోరుకుంటామని, ఆ దేవుడు వచ్చి ఏమీ చేయడని, మనిషి రూపంలోనే సాయం చేయిస్తాడని, ఆ సాయం చేసే వాడే నాయకుడిగా ఉండేలా మనం నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు. కాగా గద్దర్‌తో అనేక కార్యక్రమల్లో తాను పాల్గొన్నానని, ఆయన ఆలోచన విధానాలు ఎంతో గొప్పవన్నారు. ఆనాడు మహదేవ్‌పూర్‌ మండల కేంద్రంలో గిరిజనుల ఆరాధ్యదైవం కొమురం భీం విగ్రహ ఆవిష్కరణను అడ్డుకుని అక్కడకు వచ్చిన గద్దర్‌ను మాట్లాడకుండా అడ్డుకున్న కాంగ్రెస్‌ నేతలు ఈనాడు గద్దర్‌కు నివాళులు అర్పిస్తున్నారని ఆయన అన్నారు.