కళ్లముందే ప్రతికూల వాతావరణం
అయినా బిపిన్ రావత్ ప్రయాణానికి అనుమతి
హెలికాప్టర్ ప్రమాదంపై సర్వత్రా అనుమానాలు
విచారణలో నిజాలు నిగ్గు తేలితేనే జాతికి ఊరట
న్యూఢల్లీి,డిసెంబర్10(జనంసాక్షి): బిపిన్ రావత్ ప్రయాణించిన తీరు..ఆయన హెలికాప్టర్ ప్రమాదానికి గురయిన తీరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. ప్రతికూల వాతావరణం లోనూ వైమానికదళం ఎందుకు అనుమతించిందన్న ప్రశ్న ఉదయిస్తోంది. తమిళనాడు నీలగిరి జిల్లాలో మంగళవారం వరకూ భారీ వర్షాలు కురిశాయి. దట్టమైన మంచు కూడా కమ్మేసుకుంది. ఎదుటి వారు కనిపించనంతగా మంచు ఉంది. బుధవారం ఉదయం కూడా స్వల్పంగా వర్షం కురిసినట్లు స్థానికులు చెబుతున్నారు. అడవిలో మధ్యాహ్నం దాకా మంచు అలుముకునే ఉంది. ముందు ఏముందో కనిపించనంతగా మంచు ఉంటే హెలికాప్టర్ ప్రయాణానికి అనుమతించరు. అయినా సైన్యాధ్యక్షుడి ప్రయాణానికి ఎలా అనుమతించారు. ఇవన్నీ సామాన్యుల్లో కలుగుతున్నఅనుమానాలు. మామూలుగానే ఇలాంటి సందర్భాల్లో అనుమతి ఉండదు. కానీ పొగమంచులో హెలికాప్టర్ ప్రయాణించినట్లు చివరిసారిగా తీసిన ఓ వీడియోకు చిక్కిన దృశ్యాలు స్పష్టం చేస్తున్నాయి. ఇంతటి ప్రతికూల పరిస్థితులు కళ్లకు కనిపిస్తున్న వేళ ప్రయాణ అనుమతులపై సామాన్యులు కూడా పెదవి విరుస్తున్నారు. సర్వసైన్యాధిపతి, ఆయన సతీమణితో సహా కీలకమైన అధికారులు, రక్షణ సిబ్బందిని బలి తీసుకున్న దారుణం ఎలా జరిగిందన్న ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు. దట్టమైన పొగమంచే ఇంత ఘోరానికి కారణమై ఉంటుందా అన్నది కూడా తేలాల్సి ఉంది. హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తిందా అన్నఅనుమానాలు కూడా వస్తున్నాయి. బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి వంటి వారు అనుమానిస్తున్నట్లుగా కుట్ర కోణం ఏమైనా ఉందా? ఇప్పుడు ఈ ప్రశ్నలు సామాన్యులను వేధిస్తున్నాయి. ఒకవైపు జవనాశ్వం లాంటి ఎంఐ`17వీ5 హెలికాప్టర్! అందులో ప్రయాణిస్తున్నది చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) బిపిన్ రావత్! హెలికాప్టర్‌ను నడుపుతున్నది అనుభవజ్ఞులైన పైలట్లు! మరి… నీలగిరి కొండల్లో, దట్టమైన పొంగ మంచు మధ్య హెలికాప్టర్ ప్రయాణిస్తే జరిగే ముప్పును గ్రహించలేకపోయారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రావత్ బృందం ప్రయాణిస్తున్న హెలికాప్టర్ సూలూరు ఎయిర్ బేస్ నుంచి వెల్లింగ్టన్‌కు బయల్దేరిన సమయానికి ఉన్న వాతావరణ పరిస్థితులు వైమానిక రంగానికి బాగా తెలుసు. నీలగిరి కొండల మధ్య లోయలో ప్రయాణిస్తోంది. అయితే.. ఎంఐ`17వీ5 సాధారణ హెలికాప్టర్ కాదు. ప్రతికూల వాతావరణంలోనూ ప్రయాణించగలిగే సామర్థ్యం దీని సొంతం. అలాంటిది, పొగమంచులో ప్రయాణించలేకపోయిందా? లేక… పొగమంచు వల్ల తలెత్తే ప్రమాదాన్ని పైలట్లు గుర్తించలేకపోయారా? అన్న పలురకాలు ప్రశ్నలను ప్రజలు సంధిస్తున్నారు. ఎంఐ17`వీ5 హెలికాప్టర్ గరిష్ఠంగా 6 వేల విూటర్ల ఎత్తులో ప్రయాణించగలదు. అంటే.. దాదాపు 18వేల అడుగులు. కింద పొగ మంచు ఆవరించినప్పుడు మరింత ఎత్తుకు వెళ్లాలికానీ, తక్కువ ఎత్తులో ఎందుకు ప్రయాణిస్తున్నారనే సందేహం కూడా తలెత్తుతోంది. సూలూరు ఎయిర్‌బేస్ సిబ్బందికి ఇక్కడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులపై పూర్తి అవగాహన ఉండే వుంటుంది. సూలూరు ` వెల్లింగ్టన్ డిఫెన్స్ కాలేజీ మధ్య హెలికాప్టర్లు తరచూ తిరుగుతూనే ఉంటాయి. మరి… బుధవారం జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ విషయంలో ఏం జరిగిందనేది ఇప్పుడు అందరిలోనూ సమాధానం లేని ప్రశ్నగా మారింది. వైమానిక దళానికి చెందిన ఈ హెలికాప్టర్‌లో ప్రత్యామ్నాయ వ్యవస్థలూ ఉంటాయి. తాము ప్రమాదంలో ఉన్నట్లు ఎలాంటి సంకేతాలూ పంపించలేదు. సూలూరు ఎయిర్ బేస్ నుంచి వెల్లింగ్టన్‌కు కేవలం 25 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఇంత తక్కువ వ్యవధిలో అక్కడ ఏం జరిగి ఉండొచ్చనేది ఊహించలేక పోతున్నారు. బుధవారం కూలిపోయిన హెలికాప్టర్ చివరిసారి సర్వీసింగ్ చేసిన తర్వాత దాదాపు 26 గంటలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎగిరిందని అంటున్నారు. అంతకుముందు 2, 3 ట్రిప్‌లలో చిన్న ఇబ్బంది కూడా కనిపించలేదని తెలుస్తోంది. రెండు ఇంజన్లు విఫలమైనప్పటికీ పరిస్థితులు అనుకూలిస్తే హెలికాప్టర్‌ను ఏ పొలాల్లోనైనా భద్రంగా కిందికి దించే వీలు కూడా ఉంది. అంటే అక్కడ అసాధారణ ప్రమాదమేదయినా జరిగిందా అన్నది వెల్లడికావాల్సి ఉంది. రావత్ సహా కీలకమైన సైనికాధికారులను బలితీసుకున్న ఈ ప్రమాదానికి అసలు కారణమేమిటి… అనేది విచారణలోనే తేలుతుంది. అయితే… ఇలాంటి ప్రమాదాలపై విశ్లేషణ, దర్యాప్తు ముగిసేందుకు చాలా సమయం పడుతుందని గత ఉదంతాలు స్పష్టం చేస్తున్నాయి. దేశంలో ఇప్పటికి డజనుకుపైగా ఎంఐ`17 రకం హెలికాప్టర్లు కుప్పకూలాయి. 2011లో 23 మందితో వెళ్తున్న ఎంఐ`172 హెలికాప్టర్ అరుణాచల్ ప్రదేశ్‌లో కూలిపోయిందది. ప్రయాణికుల్లో 19 మంది చనిపోయారు. హెలికాప్టర్ ముక్కలుముక్కలై పోయింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంటులో చేసిన ప్రకటన ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12.08 గంటలకు సూలూరు ఏటీసీతో హెలికాప్టర్‌కు పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే స్థానికులు పెద్ద శబ్దం విన్నారు. అడవిలో మంటలను గమనించారు. ఏటీసీతో లింక్ తెగిపోయిన కొద్దిసేపటికి ప్రమాదం జరిగింది. దీనిపై వియారణలో ఎలాంటి విషయాలు వెలుగు చూస్తాయన్నది ముఖ్యం. ఏమయితేనేం..ఓ రకంగా ఇది పూర్తినిర్లక్ష్యంతో కూడుకున్న వైఖరిగానే చూడాలి. వాతావరణ ప్రతికూల పరిస్థితిలో హెలికాప్టర్ వెళ్లడానికి అనుమతించడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.