కవులకు పారితోషికం వెంటనే ఇవ్వాలి:ప్రజావాణి లో‌‌‌ కలక్టర్ కు‌ వినతిపత్రం ఇచ్చిన‌ కవులు

జనగామ  (జనం సాక్షి)జూలై‌ 4 జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు జరిగిన కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులకు   పారితోషికం ఇవ్వాలని కోరుతూ కవిసమ్మేళనం నిర్వాహక కమిటీ సభ్యులు ప్రజావాణిలో‌‌ జిల్లా కలక్టర్ సి.హెచ్. శివలింగయ్య కు సోమవారం వినతిపత్రం అందజేశారు.సమ్మేళనంలో పాల్గొన్న  కవులకు గౌరవ పారితోషికంగా రెండు వేల రూపాయలు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ విడుదల చేసిన లేఖలో సవివరంగా తెలియజేశారని గుర్తు చేశారు.రాష్ట్రంలో అన్ని జిల్లాలలో కవులకు మంచి గౌరవం, గుర్తింపు ఇచ్చారు కా‌నీ జనగామ జిల్లాలో కవులకు అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనాటి కార్యక్రమంలో కవులకు కనీసం టీ కూడా తెప్పించలేని  పరిస్థితిలో జిల్లా యంత్రాంగం ఉండటం బాధకరమన్నారు. ఇతర జిల్లాలలో కలెక్టర్లు, జిల్లా యంత్రాంగం కవి సమ్మేళనం కన్నుల పండుగలా నిర్వహించారని, కవులకు సన్మానాలు, సత్కారాలు, శాలువాలు, భోజనాలు పెట్టి  ప్రభుత్వం  ఇచ్చే  2వేల రూపాయలతో పాటుగా  ఇంకొంత  అదనంగా కలిపి 3 వేల రూపాయలు ఇచ్చి కవులను  ఆదరించి, గౌరవించి, ప్రేమించారు కానీ జనగామ జిల్లా అందుకు విరుద్ధంగా జరిగిందని వివరించారు.గౌరవ పారితోషికం ఇచ్చే తేదీని వెంటనే ప్రకటించాలని,గౌరవ పారితోషికం కలెక్టర్  చేతుల మీదుగా ఇప్పించాలని, నూతన కలెక్టర్ కార్యాలయంలోనే‌ పారితోషిక పంపిణి నిర్వహించాలని కోరారు. కలక్టర్ ను కలిసి వినతిపత్రం ఇచ్చినవారిలో కవులు జి. కృష్ణ, పెట్లోజు సోమేశ్వరాచారి,పొట్టబత్తిని భాస్కర్,లగిశెట్టి ప్రభాకర్, మాన్యం భుజేందర్, జంగ వీరయ్య, చిలుమోజు సాయికిరణ్ తదితరులు ఉన్నారు.