కవ్వాల్‌ పరిసరాల్లో జంతువల వేటపై కఠిన చర్యలు

ఆదిలాబాద్‌,మార్చి(జ‌నంసాక్షి): జిల్లాలో పులుల సంచారం అంతంత మాత్రంగానే ఉన్నా.. భవిష్యత్తులో వీటి సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. అడవుల రక్షణకు పటస్ట చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో వీటి సంఖ్య గణనీయంగా పెరగగలదని భావిస్తున్నారు. అలాగే కవ్వాల్‌ రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అటవీ జంతువులను వేటాడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. కుందేళ్లు, అడవి పందులకు ఉచ్చులు బిగించి హతమర్చినట్లయితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని డిఎఫ్‌వోపేర్కొన్నారు. మరోవైపు కవ్వాల్‌ పులుల సంరక్షణ కేంద్రంలో రానున్న రోజుల్లో వేటగాళ్ల ముప్పు పొంచి ఉందన్న ఆందోళనుంది.  ఇక్కడ పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లేకుంటే పులులు అంతం చేసే దుండగులు కూడా తయారవుతున్నారు.  పులిపై కొందరు వేటగాళ్లు పంజా విసురుతున్నారు. పులుల హంతక ముఠా సంచరిస్తుందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.   ఇక్కడ ఏర్పాటు చేసిన కవ్వాల్‌ అభయారణ్యంలో కూడా పులుల రక్షణకు

ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.  జిల్లాలో పెద్దపులులకు నిలయంగా కవ్వాల్‌ పులుల సంరక్షణ కేంద్రం నిలిచే అవకాశాలున్నాయి.  పులుల రాకపోకలకు కావాల్సిన కారిడార్‌ అనుకూలంగా ఉండడం కవ్వాల్‌కు కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. ముఖ్యంగా పులికి కావాల్సిన ఆహారం కోసం శాఖాహార జంతువుల సంఖ్య ఇక్కడ విరివిగా పెరిగిందని సమాచారం. ఇటీవల సర్వేలో పెద్దపులుల సంఖ్య పెరిగిందన్న వార్తలు జిల్లా అధికారల్లో ఉత్సాహం నింపుతోంది.కవ్వాల్‌ పులుల సంరక్షణ కేంద్రంలోని పెద్దపులులు, చిరుతపులుల రక్షణకు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు కోరుతున్నారు.  భారతదేశంలోనే రెండో అతి పెద్దపులుల సంరక్షణ కేంద్రం చంద్రపూర్‌లోని తాడోబాలో ఉంది. అక్కడి నుంచి పులుల సంచారం ఇక్కడి వరకు ఉంటుంది.   అటవీ ప్రాంతం ఆక్రమణకు గురై పులులు సంచరించేందుకు సరిపడా అటవీ ప్రాంతంలో లేకపోవడంతో పులులు అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చి ప్రమాదాల బారిన పడుతున్నాయి. ఇలాంటి అనేక సమస్యలను అధిగమించి, స్మగ్లర్ల దాడినుంచి పులులను రక్షించుకోవాల్సి ఉంది. ఈ దశలో అడవుల రక్షణకు గట్టి చర్యలు తీసుకోవాలని అటవీశాఖమంత్రి జోగురామన్న ఆదేశించారు. దీంతో అధికారులుచర్యలకు ఉపక్రమించారు. ఇదిలావుంటే కడెం మండలంలోని గంగాపూర్‌ అడవుల్లో అటవీ జంతువు నీలుగాయిని వేటాడి చంపిన నలుగురు వ్యక్తులను అటవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కడెం జలాశయానికి అవతలి వైపున గంగాపూర్‌ అడవుల్లో ఓముఠా అడవి జంతువులను వేటాడుతోందని వచ్చిన సమాచారం మేరకు గుట్టల్లో ఓచోట వేటగాళ్ల ముఠా నీలుగాయిని వేటాడి మాంసాన్ని రవాణాకు సిద్ధం చేస్తుండగా చూసిన తమ సిబ్బంది నలుదిక్కులా చుట్టుముట్టి వారిని పట్టుకుని మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు.  వన్యప్రాణులను వేటాడి చంపడం నేరం కాబట్టి వీరిపై కేసు నమోదుచేసి కోర్టులో హాజరు పరచనున్నట్లు చెప్పారు.