కాంగ్రెస్‌తో జట్టుకు చంద్రబాబు తహతహ

– రాష్ట్రంలో అవినీతిపై బాబు విచారణ ఎదుర్కోక తప్పదు
– వైసీపీ ఎమ్మెల్యే ఐజయ్య
కర్నూలు,జూన్‌26(జ‌నం సాక్షి): కాంగ్రెస్‌ పార్టీతో జత కట్టేందుకు సీఎం చంద్రబాబు నాయుడు తహతహలాడుతున్నాడని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఐజయ్య అన్నారు. జిల్లాలోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన విూడియాతో మాట్లాడారు. పోలవరం కాంగ్రెస్‌ పెట్టిన భిక్షే అని ముఖ్యమంత్రి చెప్పడం ఆయన ద్వంద వైఖరికి నిదర్శమని చెప్పారు. ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ దివంగత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పేరును ప్రస్తావించకపోవడం చంద్రబాబు సంకుచిత స్వభావాన్ని తెలియజేస్తుందని పేర్కొన్నారు. వైఎస్సార్‌ లేకపోతే పోలవరం లేదన్న సంగతిని చంద్రబాబు మరచిపోయారన్నారు. 2007లో పోలవరానికి శంకుస్థాపన వైఎస్సార్‌, కేవలం 5,135 కోట్లతో 30 శాతం ప్రాజెక్టు పనులను పూర్తి చేశారని ఐజయ్య వెల్లడించారు. జలయజ్ఞం కార్యక్రమం ద్వారా సాగు, తాగునీటి ప్రాజెక్టులను ప్రారంభించిన అపర భగీరథుడు వైఎస్సార్‌ అని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలసి పోటీ చేసేందుకు చంద్రబాబు తహతహలాడుతున్నారన్నారు. అందుకే వాస్తవాలను గాలికి వదిలేసి మాట్లాడుతున్నారన్నారు. అవినీతి సొమ్ముతో 2019 ఎన్నికల్లో గెలవాలని చంద్రబాబు అనుకుంటున్నారన్నారు. ఓటుకు రూ. 5 వేల చొప్పున పంపిణీ చేసేందుకు ఆయన సిద్ధమయ్యారని, రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై చంద్రబాబు కచ్చితంగా విచారణను ఎదుర్కొంటారన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధానమంత్రిని కలవలేదని దౌర్భాగ్యస్థితిలో చంద్రబాబు ఉన్నారని, బాబు అవినీతిపై ఆరోపణలు చేస్తున్న భారతీయ జనతా పార్టీ(బీజేపీ) విచారణకు ఎందుకు ఆదేశించడం లేదో అర్థం కావడం లేదన్నారు. ప్రజాసంకల్పయాత్రలో వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, చంద్రబాబు ఎన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా భయపడేది లేదన్నారు. రానున్నది జగనన్న ప్రభుత్వమేనని ఐజయ్య అన్నారు.