కాంగ్రెస్‌ది రాజకీయ ఎజెండా

 

మాది అభివృద్ది జెండా: పాయం

భద్రాద్రికొత్తగూడెం,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్‌ మహాకూటమి కట్టిందని, కాంగ్రెస్‌ రాజకీయ డ్రామాలను ఎండగడతామని పినపాక మాజీ ఎమ్మెల్యే,టిఆర్‌ఎస్‌ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. సమస్యలపై చర్చించేందుకు కాంగ్రెస్‌ ఎప్పుడూ సిద్దంగా లేదని అన్నారు. అన్ని సమస్యలపై చర్చతో తాము ప్రజల్లోకి వెళుతున్నామని, కాంగ్రెస్‌ మాత్రం రాజకీయ ఎజెండాతో పనిచేస్తోందని అన్నారు. తాము చేపట్టిన అనేక పనులకు సంబంధించి ప్రజల్లో చర్చకు రావాలని అన్నారు. ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నల్లానీరు నీరందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, సీఎం కేసీఆర్‌ మిషన్‌ భగీరథ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని అన్నారు. అత్యంత వేగంగా మిషన్‌ భగీరథ నిర్మాణ పనులు నడుస్తున్నాయని అన్నారు. ఇప్పటికే మణుగూరు – అశ్వాపురం మండలాల సరిహద్దు రథంగుట్ట వద్ద జరుగుతున్న మిషన్‌ భగీరథ వాటర్‌ ట్రీట్‌మెంట్‌, రా వాటర్‌, క్లీన్‌ వాటర్‌ ప్లాంట్‌ పనులు, అశ్వాపురం మండల కుమ్మరిగూడెం వద్ద ఇన్‌టేక్‌వెల్‌ పనులు పూర్తి కావచ్చాయని అన్నారు. పినపాక నియోజకవర్గానికి స్వచ్ఛమైన మంచినీరు ప్రతి ఇంటికీ సరఫరా చేయడం జరుగుతుందన్నారు.

ఎన్నికల మ్యానిఫెస్టోలో ఆసరా పింఛనుదారుల్లో వృద్ధులకు రూ.1000 నుంచి రూ.2016, వికలాంగులకు రూ.1500 నుంచి రూ.3016, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి రూ.3016, రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని ఎకరానికి రెండు పంటలకు గాను రూ.8వేల నుంచి రూ.10వేలకు పెంచడం, డబుల్‌బెడ్‌రూం ఇళ్లను స్థలాలు ఉన్న వారికి సైతం కట్టిస్తానని చెప్పడం, రెడ్డి కార్పొరేషన్‌, ఆర్యవైశ్య కార్పొరేషన్‌లను ఏర్పాటు చేస్తామని.. ఇలా అన్నివర్గాలకు ఆమోదయోగ్యంగా వరాలను కురిపించి టీఆర్‌ఎస్‌ పార్టీపై ప్రజలకు ఎంతో ఆదరణ కలిగేలా కేసీఆర్‌ చేశారని వివరించారు. మ్యానిఫెస్టోలో ప్రకటించినవన్నీ ప్రజలకు ఎంతో ఆనందాన్నిచ్చాయని ప్రజలే తమ పార్టీని, అభ్యర్థులను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఏదేమైనా ఈసారి ఎన్నికల్లో తనకు మళ్లీ ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే రానున్న కాలంలో ఈ ప్రాంత అభివృద్ధి ఎలా ఉంటుందో విూరే చూస్తారని ఆయన ఓటర్లను అభ్యర్థించారు.