కాంగ్రెస్‌పై జనంలో నమ్మకం పోయింది

– మళ్లీ దేశానికి ప్రధాని మోదీనే
– అవినీతికి పాల్పడేది అధికారులా.. తెరాస నేతలా?
– భాజపా నేత డీకే అరుణ
నల్గొండ, ఏప్రిల్‌20(జ‌నంసాక్షి) : రాష్ట్రంలో అవినీతికి పాల్పడేది రెవెన్యూ అధికారులా ? టీఆర్‌ఎస్‌ నాయకులా ? అని బీజేపీ నేత డీకే అరుణ ప్రశ్నించారు. శనివారం నల్గొండలో బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. చట్టాల్లో మార్పుకోసం సీఎం కేసీఆర్‌ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదని హితవుపలికారు. ఓటమి భయంతోనే పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలు రాక ముందే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీనేనన్నారు. కాంగ్రెస్‌పై జనంలో నమ్మకం పోయిందని వ్యాఖ్యానించారు. దేశమంతా మరోసారి మోడీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని స్పష్టంచేశారు. రాహుల్‌గాంధీ ప్రధాని కావడం అసాధ్యమని, వచ్చేది భాజపా నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వమేనని ఆశాభావం వ్యక్తంచేశారు. సుపరిపాలనతో ప్రధాని నరేంద్ర మోదీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందన్నారు. అయిదేళ్ల పాలనలో దేశంలో ఒక్క ఉగ్రదాడి కూడా జరగకపోవటం ప్రభుత్వం శాంతిభద్రతలకు ఇచ్చిన ప్రాధాన్యాన్ని చాటిచెబుతుందన్నారు. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను నిమిషాల వ్యవధిలో నాశనం చేసిన వాయుసేన ఘనత గురించి ఎంతచెప్పినా తక్కువేనన్నారు. మోదీ సాహసోపేత నిర్ణయం తీసుకోవటం వల్లనే ఇది సాధ్యమైందన్నారు. యువత మోదీని అభిమానిస్తోందని, ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటును ఆపలేరన్నారు. కేంద్ర ప్రభుత్వం పంచాయతీల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించిందని, స్వచ్చభారత్‌ కింద భారీగా మరుగుదొడ్లను నిర్మించిందని తెలిపారు. కేంద్ర పథకాలను సీఎం కేసీఆర్‌ తమవిగా చెప్పుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేయాలని, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. తెలంగాణాలో తెరాసకు ప్రత్యామ్నాయం భాజపా మాత్రమేనని, కాంగ్రెస్‌లోని ప్రధాన నేతలంతా పార్టీని వీడుతున్నారని డి.కె. అరుణ పేర్కొన్నారు.

తాజావార్తలు