కాంగ్రెస్‌లో ఇంట్లో ఓట్లు పడని నేతలంతా సిఎం అభ్యర్థులే
ఎద్దేవా చేసిన మంత్రి కెటిఆర్
టిఆర్‌ఎస్‌లో చేరిన ఉప్పల శ్రీనివాస్ గుప్తా
హైదరాబాద్,అక్టోబర్10(జనంసాక్షి): కాంగ్రెస్ పార్టీలో సొంత ఇంటి ఓట్లు పడనివారు కూడా ముఖ్యమంత్రి అభ్యర్థులేనని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. నల్లగొండలో ఉన్న కాంగ్రెస్ నేతలంతా సిఎం అభ్యర్థులేనని అన్నారు. బీజేపీ హావిూలు వింటుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదని అని కేటీఆర్ అన్నారు. ఆర్యవైశ్య కమ్యూనిటీ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్ లో చేరారు.
ఆర్యవైశ్య కమ్యూనిటీలోని పేదల కుటుంబాలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రకటించారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డివి ఉత్తుత్తి మాటలని కేటీఆర్ మండిపడ్డారు. ఓటర్ జాబితాలో పేర్లను తామెందుకు తొలగిస్తామని, ఓట్లెక్కువుంటే తమకే మెజారిటీ పెరుగుతది కదా అని కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలకు సొంత ఇంటి ఓట్లు కూడా పడవన్నారు. ప్రజాకోర్టులోనే తేల్చుకుందామని ఎన్నికలకు పోతున్నట్లు చెప్పారు. తామంతా రాబోయే తరాల కోసం పనిచేస్తున్నామని కేటీఆర్ పునరుద్ఘాటించారు. గురుకుల విద్యాలయాల ద్వారా 3 లక్షల మంది పిల్లలకు ప్రపంచస్థాయి
విద్యను అందిస్తున్నట్లు చెప్పారు. చనిపోయిన వారి వేలిముద్రలతోటి కాళేశ్వరంపై కేసు వేసిన్రని మండిపడ్డారు. ప్రజాకోర్టులోనే తేల్చుకుందామని ఎన్నికలకు పోతున్నమన్నారు. ప్రతి ఎకరాకు సాగునీరు ఇచ్చేందుకు ప్రాజెక్టులు నిర్మిస్తున్నం. తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా ఢిల్లీకి గులాములుగా ఉందామా? అని కేటీఆర్ ప్రజలను ప్రశ్నించారు. ఒకరు కిరాయి కడతాం అంటారు..మరొకరు పెళ్లి కాని అబ్బాయిలకు పిల్లను వెతికి పెడతామంటారని మంత్రి కేటీఆర్ కాంగ్రెస్, బీజేపీలను విమర్శించారు. దక్షిణాదిలో ఉన్న ఆరు రాష్ట్రాల బడ్జెట్ కలిపినా కాంగ్రెస్ ఇచ్చే హావిూలు నెరవేర్చలేరని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణభవన్‌లో ఉప్పల శ్రీనివాస్‌గుప్తాకు మంత్రి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్‌గుప్తా మాట్లాడుతూ..సీఎం కేసీఆర్‌కు వైశ్యుల విూద ప్రత్యేక అభిమానం ఉందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేసేందుకే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు చెప్పారు. గత పాలకుల నిర్లక్ష్యంతో వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలతో వ్యవసాయం గాడిన పడుతున్నదన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.