కాంగ్రెస్‌లో గూటికి 

మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి
– రాహుల్‌గాంధీ సమక్షంలో చేరిక
– మళ్లీ కాంగ్రెస్‌లోకి రావటం ఆనందంగా ఉంది
– బీజేపీ ఏపీని దారుణంగా మోసం చేసింది
– విభజన చట్టాన్ని సమర్థంగా అమలు చేయాలంటే కాంగ్రెస్‌తోనే సాధ్యం
– హావిూలు సాధించటంలో టీడీపీ వైసీపీలు విఫలం
– విలేకరుల సమావేశంలో మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి
న్యూఢిల్లీ, జులై13(జ‌నం సాక్షి) : ఉమ్మడి ఆంధప్రదేశ్‌ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి తిరిగి కాంగ్రెస్‌ పార్టీ గూటికి చేరారు. శుక్రవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కిరణ్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఉమెన్‌ చాందీ, అశోక్‌ గెహ్లాట్‌, పళ్లంరాజు, రఘువీరారెడ్డి తదితర సీనియర్‌ నేతలు పాల్గొన్నారు. రాహుల్‌తో భేటీ అయ్యేందుకు కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారమే ఢిల్లీ చేరుకున్నారు. అనంతరం ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరాతో కలిసి కిరణ్‌కుమార్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మళ్లీ కాంగ్రెస్‌ పార్టీలోకి రావటం ఎంతో సతోషంగా ఉందన్నారు. తన కుటుంబానికి కాంగ్రెస్‌కు ఎంతో అనుబంధం ఉందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ వల్లే తమకు గుర్తింపు లభించిందన్నారు. ఏపీలో ప్రత్యేక రాష్ట్రం తరువాత ప్రజల్లో అయోమయం నెలకొందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు సమయంలో హావిూలను అమలు చేయడంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఏపీని నిలువునా బీజేపీ మోసం చేసిందని ఆరోపించారు. తెలుగుదేశం, వైసీపీలు సైతం విభజన హావిూలను సాధించటంలో పూర్తి విఫలమయ్యాయన్నారు. కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఏపీకి న్యాయం జరుగుతుందని, ప్రస్తుత సమయంలో దేశానికి రాహుల్‌ ప్రధాని కావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. రాహుల్‌ను ప్రధానిని చేయడం ద్వారా ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవచ్చని కిరణ్‌ పేర్కొన్నారు. ఏపీలో పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని, పార్టీ ఏబాధ్యత ఇచ్చినా సమర్థవంతంగా పని చేస్తామన్నారు. కాంగ్రెస్‌ పార్టీలోకి వచ్చేందుకు 30 నుంచి 40మంది సిద్ధంగా ఉన్నారని, వారందరినీ పార్టీలోకి ఆహ్వానించి పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. అనంతరం ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాట్లాడుతూ.. ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ఈ కోవలో కిరణ్‌కుమార్‌ చేరిక కలిసొస్తుందన్నారు.
బీజేపీ ఏపీకి తీవ్ర అన్యాయం చేసిందని, టీడీపీ, వైసీపీలుకూడా తమకేవిూ పట్టనట్లు వ్యవమరిస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేసేలా ఐక్యంగా కలిసి ముందుకు సాగుతామన్నారు.