కాంగ్రెస్‌ కంచుకోటలో..గులాబీ పాగా

– భారీ మెజార్టీతో విజయం సాధించిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సైదిరెడ్డి
– ఏఒక్క రౌండ్‌లోనూ పైచేయి సాధించలేక పోయిన కాంగ్రెస్‌
– ఓటమితో తీవ్ర నిరాశలో కాంగ్రెస్‌ శ్రేణులు
– రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు చేసుకున్న టీఆర్‌ఎస్‌ శ్రేణులు
– బొక్కబోర్లా పడ్డ బీజేపీ, టీడీపీ
సూర్యాపేట, అక్టోబర్‌24 (జనం సాక్షి): కాంగ్రెస్‌ కంచుకోటను అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ బద్దలు కొట్టింది. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఆపార్టీ అభ్యర్థి సైదిరెడ్డి విజయం సాధించారు. ప్రతిష్టాత్మకంగా మారిన హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఊహించని విధంగా 30వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. మొత్తం 22రౌండ్‌లలో ఏ ఒక్క రౌండ్‌లోనూ పూర్తిస్థాయిలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పద్మావతి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై పైచేయి సాధించలేక పోయారు. కాంగ్రెస్‌కు తిరుగులేని మండలాల్లోనూ ఆపార్టీ బొక్కాబోర్లా పడింది. దీంతో టీఆర్‌ఎస్‌ శ్రేణులు సంబురాల్లో మునిగి తేలగా.. గెలవాల్సిన సీటులో ఘోర ఓటమి చవిచూడటంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో తీవ్ర నిరాశకు లోనయ్యారు.   హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికను రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠను రేపింది. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లోక్‌సభ ఎన్నికల్లో నల్గొండ నుంచి పోటీచేసి గెలుపొందడంతో ఇక్కడ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. తనకు కంచుకోట అయిన ఈ నియోజకవర్గంలో మరోసారి గెలుపు ఖాయమన్న ధీమాతో ఉత్తమ్‌.. తన సతీమణి పద్మావతిని బరిలోకి దింపారు. గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ఓడిపోయిన సైదిరెడ్డిని మరోసారి టీఆర్‌ఎస్‌ బరిలోకి దింపింది. బీజేపీ, టీడీపీ వంటి పార్టీలు బరిలో నిలిచినా.. పెద్దగా ప్రభావం చూపలేదు. టీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌ మధ్య పోటీ నువ్వా-నేనా అన్నట్టుగా సాగింది. ఇరుపార్టీల అగ్రనేతలు పెద్దసంఖ్యలో మోహరించి.. భారీ ఎత్తున ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ సమ్మె జరగడం, ప్రభుత్వానికి కొంత ఇబ్బందికర వాతావరణం ఉండటంతో ఆ ప్రభావం హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికపై పడుతుందేమోనన్న ఆందోళన గులాబీ శ్రేణుల్లో కనిపించింది. అయితే, ఈసారి హుజూర్‌ నగర్‌ ప్రజలు గులాబీ అభివృద్ధి మంత్రానికి ఓటేశారు. మూడుసార్లు గెలిపించినప్పటికీ ఉత్తమ్‌ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయారని, గులాబీ గెలుపుతోనే ఇక్కడ అభివృద్ధి సాధ్యమంటూ సైదిరెడ్డి, టీఆర్‌ఎస్‌ నేతలు ప్రచారాన్ని ¬రెత్తించారు. ఈ ప్రచారం ఫలించినట్టు ఉప ఎన్నిక ఫలితాల్లో స్పష్టమైంది. ఇక్కడ అంచనాలకు మించి కారు జోరుగా దూసుకుపోవడంతో ప్రతిపక్ష పార్టీలు బొక్కాబోర్లా పడ్డాయి.  తొమ్మిది రౌండ్లు పూర్తయ్యేసరికి 19,200 ఓట్ల ఆధిక్యంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సైదారెడ్డి దూసుకెళ్లారు. ప్రతి రౌండ్‌లోనూ కనీసం రెండు వేల వరకు ఓట్ల ఆధిక్యం కొనసాగింది. 9రౌండ్లు ముగిసేసరికి ఏ ఒక్క దశలోనూ కాంగ్రెస్‌ అభ్యర్థి ఉత్తమ్‌ పద్మావతిరెడ్డికి ఆధిక్యం రాలేదు. దీంతో ఉత్తమ్‌ పద్మావతి రెడ్డి కౌంటింగ్‌ కేంద్రం నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. ఓటమికి గల కారణాలను ఆమెనే విలేకరులు ప్రశ్నించే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె స్పందించకుండా మౌనంగా వెళ్లిపోవటం కనిపించింది.
బీజేపీ, టీఆర్‌ఎస్‌ అడ్రస్సు గల్లంతు..
తెలంగాణలో తామే ప్రధాన ప్రతిపక్షమంటూ గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీకి డిపాజిట్‌ దక్కని పరిస్థితి కనిపించింది. ఇటీవల జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాలను దక్కించుకున్న బీజేపీ ఇక తిరుగులేదని చెప్పుకుంటూ వస్తుంది. రాబోయే ఎన్నికల నాటి తామే కింగ్‌ మేకర్లమని ఆ పార్టీ నేతలు
చెప్పుకుంటూ వచ్చారు. కాగా తొలిసారి జరిగిన ఉప ఎన్నికల్లో తమ సత్తాచూపిస్తామని బీజేపీ అభ్యర్థిని నిలిపినప్పటికీ ఏమాత్రం తన ప్రభావాన్ని చూపలేక పోయింది. మరోవైపు తెలంగాణలో తుడిచిపెట్టుకుపోయిన టీడీపీ ఉనికి కోసం హుజూర్‌నగర్‌లో పోటీచేసినా ఘోరమైన భంగపాటు తప్పలేదు. కనీస ఓట్లుసైతం సాధించలేక పోవటంతో ఆపార్టీ ఇక తెలంగాణలో రాణించలేదని స్పష్టమైన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
రౌండ్ల వారిగా ఓట్ల వివరాలు..
హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నికల్లో ప్రతీ రౌండ్‌లోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సైదిరెడ్డి స్పష్టమైన మెజార్టీని సాధించారు. మొదటి రౌండ్‌లో టిఆర్‌ఎస్‌ -5583 ఓట్లు రాగా, కాంగ్రెస్‌-3107, బిజెపి-128, టిడిపి-113ఓట్లు వచ్చాయి. దీంతో మొదటి రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ 2476ఓట్లు మెజార్టీ సాధించింది. రెండవ రౌండ్‌లో టిఆర్‌ఎస్‌ 4723 ఓట్లు సాధించగా, కాంగ్రెస్‌-2851 ఓట్లు, బిజెపి-170 ఓట్లు, టిడిపి-69ఓట్లు సాధించింది. దీంతో రెండవ రౌండ్‌లోనూ టిఆర్‌ఎస్‌ 1872 మెజార్టీని సాధించింది. మూడవ రౌండ్‌లో టిఆర్‌ఎస్‌ -5089 ఓట్లు, కాంగ్రెస్‌-2540 ఓట్లు, బిజెపికి114 ఓట్లు, టిడిపి 86 ఓట్లు వచ్చాయి. దీంతో మూడవ రౌండ్‌లో టిఆర్‌ఎస్‌ 2549 మెజార్టీ సాధించింది. నాల్గవ రౌండ్‌లో టిఆర్‌ఎస్‌ అబ్యర్థి సైదిరెడ్డి 5144 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ పార్టీకి 3961 ఓట్లు పోలయ్యాయి. బిజెపి కి102, టిడిపికి 127 ఓట్లు పోలయ్యాయి. నాలుగవ రౌండ్‌లో 1183 ఓట్ల మెజార్టీని సైదారెడ్డి సాధించారు. ఐదవ రౌండ్‌లో టిఆర్‌ఎస్‌ కు5041 ఓట్లు రాగా, కాంగ్రెస్‌ కు 3032 ఓట్లు, బిజెపీకి 105 ఓట్లు, టిడిపికి 57 ఓట్లు పోలయ్యాయి. దీంతో ఐదవ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ అబ్యర్థి  2009 ఓట్ల మెజార్టీ సాధించారు. అరవ రౌండ్‌లో టిఆర్‌ఎస్‌ పార్టీకి 5308 ఓట్లు రాగా, కాంగ్రెస్‌ కి 3478, బిజెపికి 72, టిడిపికి 46 ఓట్లు పోలయ్యాయి. ఆరవ రౌండ్‌లోనూ టిఆర్‌ఎస్‌ అభ్యర్థి సైదిరెడ్డి 1830 ఓట్లు ఆధిక్యం సాధించారు. ఎడవ రౌండ్‌లో టిఆర్‌ఎస్‌ కు 4900 ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు 3796 ఓట్లు వచ్చాయి. బిజెపికి 45, టిడిపికి 46 ఓట్లు పోలయ్యాయి. దీంతో ఏడవ రౌండ్‌లోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సైదారెడ్డి 1104 ఓట్లు సాధించారు. ఎనిమిదో రౌండ్‌కు వచ్చే సరికి టీఆర్‌ఎస్‌ 17,400 మెజార్టీని సాధించింది. తొమ్మిదో రౌండ్‌లో 19,200 ఓట్ల మెజార్టీ సాధించింది. ఇలా మొత్తం మధ్యాహ్నం 2గంటల వరకు 15 రౌండ్లు పూర్తయ్యే సరికి
టీఆర్‌ఎస్‌ భారీ ఆధిక్యం సాధించింది. 15వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌  అభ్యర్థికి సైదిరెడ్డికి 6118ఓట్లు రాగా, కాంగ్రెస్‌ అభ్యర్థి పద్మావతికి 3504 ఓట్లు వచ్చాయి. దీంతో 15వ రౌండ్‌లోనూ సైదిరెడ్డి 2614 ఓట్ల ఆధిక్యం సాధించారు. ఇలా 15 రౌండ్లు పూర్తయ్యే సరికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి 29,967ఓట్ల మెజార్టీ వచ్చింది. 18రౌండ్లు పూర్తయ్యే సరికి 34,506 ఓట్లు మెజార్టీని సైదిరెడ్డి సాధించారు. 19 రౌండ్లు పూర్తయ్యే సరికి 36,112 ఓట్ల మెజార్టీని సైదిరెడ్డి సాధించారు.
టీఆర్‌ఎస్‌ శ్రేణుల సంబురాలు ..
హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నికల్లోటీఆర్‌ఎస్‌ భారీ మెజార్టీ సాధించటంలో ఆ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు చేసుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ కంచుకోటను భారీ మెజార్టీతో బద్దలు కొట్టడం పట్ల సూర్యాపేట జిల్లా కేంద్రంలో పెద్ద సంఖ్యలో సంబురాలు చేసుకున్నారు. ఈ సంబురాల్లో మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, జిల్లా టీఆర్‌ఎస్‌ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీకి తిరుగులేదన్నారు. సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే ఉప ఎన్నికల్లో విజయానికి కారణమయ్యాయన్నారు. గతంలో ఎప్పుడూ గెలవని హుజూర్‌ నగర్‌లో ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించటం సంతోషంగా ఉందన్నారు. ప్రజలంతా కేసీఆర్‌ వెంటే ఉన్నారని మరోసారి
రుజువైందనిమంత్రి తెలిపారు.