కాంగ్రెస్ కూటమిలో నూతనోత్సాహం
ఇంతకాలం ఏకపక్షంగా టిఆర్‌ఎస్ ప్రచారం
మేడ్చెల్ సభతో కూటమికి సానుకూలం
హైదరాబాద్,నవంబర్24(జనంసాక్షి): ప్రధాన రాజకీయ పార్టీగా, అధికారం కోసం పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీకి మేడ్చెల్ సభ విజయం నూతనోత్సాహం నింపింది. కూటమి నేతలంతా ఒకే వేదికపైకి వచ్చి పాలుపంచుకోవడం ఒక ఎత్తయితే సోనియా,రాహుల్ గాందీల ప్రసంగం హైలెట్‌గా నిలిచింది. కదనోత్సాహంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఈ సభ కొండంత బలాన్ని ఇచ్చిందనే చెప్పాలి. ఇప్పటి వరకు టిక్కట్ల గొడవ, సీట్ల పంపకాలతో తలమునకలూన కాంగ్రెస్ పార్టీ, అధికార టిఆర్‌ఎస్ ప్రచారాన్ని దీటుగా ఎదుర్కొనేలా ముందుకు సాగలేదు. అన్నిటికి మించి కూటమి నేతలు ఉమ్మడిగా పోరాడాలని ఇచ్చిన పిలుపు, వారికి సోనియా మద్దుతు, రాహుల్ ప్రోత్సాహం కూడా తోడయ్యింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన నాలుగున్నరేళ్ల తర్వాత తొలిసారి సోనియాగాంధీ రాష్ట్రానికి రావడం ఒక ఎత్తయితే ప్రజాకూటమి తరఫున ఏర్పాటుచేసిన తొలి భారీ బహిరంగసభను ఉద్దేశించి ఉద్వేగంగా మాట్లాడి తీరు ప్రజలను కదిలించేలా ఉంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా తెలంగాణ ప్రజలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రజాకూటమిలోని నాలుగు పార్టీల నేతలు రాష్ట్ర సర్కారుపై నిప్పులు చెరిగారు. మేడ్చల్ సభావేదిక కొత్త దృశ్యాలను ఆవిష్కరించింది. అరుదైన కలయికలకు వేదికగా మారింది. మొట్టమొదటి సారిగా ఏఐసీసీ అగ్రనాయకురాలు, ఏఐసీసీ అధ్యక్షుడు, పీసీసీ అధ్యక్షుడు, తెదేపా తెలంగాణ అధ్యక్షుడు రమణ, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ, బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు
ఆర్.కృష్ణయ్య, ప్రజాకవి గద్దర్ ఒకే వేదికను పంచుకోవడం గమనార్హం. సభలో కాంగ్రెస్ జెండాలతోపాటు తెలుగుదేశం పసుపు జెండాలు, సీపీఐ ఎర్రజెండాలు, తెజస జెండాలు రెపరెపలాడాయి. వేదికపై ఆసీనులైన నేతలు కూడా వారి వారి పార్టీల కండువాలు ధరించి వచ్చారు. సభకు వచ్చిన కూటమి పార్టీల రాష్ట్ర బాధ్యులు, ప్రజా సంఘాల నేతలు, గిరిజన బడుగు, బలహీనవర్గాల నేతలను పరిచయం చేయడంతోపాటు సోనియాగాంధీని సన్మానించడం ఈ సభలో ప్రత్యేకంగా నిలిచింది. సభకు హాజరైన జనంలో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. మొత్తం విూద సభ విజయవంతం కావడం ప్రజాకూటమిలో కదనోత్సాహాన్ని నిందింది. ఇకపోతే కాంగ్రస్ అధినేత్రి సోనియాగాందీ సెంటిమెంటు డైలాగులు చెప్పడానికి ప్రయత్నించారు. ఒక తల్లి తన పిల్లల ఆలన,పాలన చూడడానికి వచ్చినట్లుగా తాను తెలంగాణకు వచ్చానని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా రాష్ట్రం ఇచ్చామని ఆమె చెప్పారు. అయితే తెలంగాణను టిఆర్‌ఎస్ ప్రభుత్వం నాశనం చేసిందని ,ప్రజలు కోరుకున్న హక్కుల మేరకు రాష్ట్రంలో పాలనలేదని ఆమె ఆవేదన చెందారు. ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరుగుతుందని తెలిసినా తప్పని పరిస్థితుల్లో ప్రజల పోరాటాన్ని గుర్తించి తెలంగాణను ఏర్పాటు చేశామని వెల్లడించారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలు భారీ బహిరంగసభలో ఒకే వేదికను పంచుకోవడం, సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంతో ఉన్నాయి. నామినేషన్లు పూర్తయి పూర్తి స్థాయి ప్రచారానికి శ్రీకారం చుడుతున్న తరుణంలో సభ జరగడం ప్రచారాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు అనుకూలించే పరిణామంగా పేర్కొంటున్నారు. కాంగ్రెస్, తెదేపా, తెజస, సీపీఐలు కలసికట్టుగా ప్రచారంలో దిగేందుకు ఇది చక్కగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. రాష్ట్రంలో వివిధ వర్గాలకు ఈ సభ ద్వారా స్పష్టమైన సందేశం వెళ్లిందని అభిప్రాయ పడుతున్నారు. ప్రజా ఉద్యమాల్లో ప్రధానమైన నేతలు మహాకూటమికి మద్దతుగా నిలబడటం సానుకూల పరిణామంగా పేర్కొంటున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐదు రాష్టాల్లో శాసనసభ ఎన్నికలు జరుగుతున్నా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మాత్రమే పాల్గొనడం ద్వారా తెలంగాణకు తానిస్తున్న ప్రాధాన్యాన్ని చాటిచెప్పారు.తన ప్రసంగంలో తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన లక్ష్యంతో పాటు తెరాస పాలన, మళ్లీ కాంగ్రెస్ రావాల్సిన అవశ్యకతను వివరించారు. మొట్టమొదటి సారిగా కాంగ్రెస్, తెలుగుదేశం కలసి ఎన్నికల బరిలో దిగుతున్న నేపథ్యంలో మేడ్చల్ సభలో ఆంధప్రదేశ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ¬దా అంశంపై మాట్లాడారు. రాష్ట్ర విభజన సమయంలో రెండు రాష్టాల్రు బాగుండాలనే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా ఇవ్వాలని పార్లమెంట్‌లో తీర్మానం చేశామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా హావిూని నెరవేరుస్తుందని చెప్పడం ద్వారా ఎపి ప్రజలకు భరోసా ఇవ్వడమే గాకుండా టిడిపితో పొత్తును బలపర్చేదిగా ఉంది.