కాంగ్రెస్‌ చివరి కోట కూలిపోతుంది

– కాంగ్రెస్‌ పాలనలో బ్రాండ్‌ కర్ణాటక పూర్తిగా దెబ్బంతింది
– బళ్లారిని బద్నాం చేసిన వారిని శిక్షించాలా..? వద్దా?
– రాష్ట్ర ప్రభుత్వం సరైన మైనింగ్‌ పాలసీ రూపొందించలేదు
– నీతి, నిజాయితీకి ప్రతిరూపం బళ్లారి
– తుంగభద్ర డ్యామ్‌ ఉన్నా తాగు, సాగునీరు అందడం లేదు
– దక్షినాది నుండి వెంకయ్యను ఉపరాష్ట్రపతి, సీతారామన్‌ను రక్షణమంత్రిని చేశాం
– ఓబీసీలకు చట్టసభలో అధికారం కోసం బిల్లు తెస్తే కాంగ్రెస్‌ అడ్డుకుంది
– బళ్లారి బహిరంగ సభలో ప్రధాని నరేంద్రమోడీ
బళ్లారి, మే3(జ‌నం సాక్షి) : కాంగ్రెస్‌ పాలనలో బ్రాండ్‌ కర్ణాటక పూర్తిగా దెబ్బతిందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. సాంస్కృతిక విలువలతో కూడిన కర్ణాటకను కాంగ్రెస్‌ ఇప్పుడు చూపించగలదా అని సూటిగా ప్రశ్నించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం బళ్లారిలో నిర్వహించిన బహిరంగసభలో పాల్గొన్న ప్రధాని మోదీ కాంగ్రెస్‌ పాలనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కర్ణాటక ప్రజల ఉత్సాహంతో కాంగ్రెస్‌ చివరి కోట కూడా కూలిపోతుందన్నారు. కాంగ్రెస్‌ పాలనలో బ్రాండ్‌ కర్ణాటక అనేది పూర్తిగా దెబ్బతిన్నదని విమర్శించారు. విజయనగర రాజుల పూర్వ వైభవాన్ని కాంగ్రెస్‌ పార్టీ నాశం చేసిందంటూ మండిపడ్డారు. సిద్దరామయ్య ప్రభుత్వం తీరుతో కర్ణాటక అప్పుల్లో కూరుకుపోవడంతో ప్రజలు సతమతమవుతున్నారు. తప్పుడు ప్రచారంతో కాంగ్రెస్‌ నేటికీ కర్ణాటక ప్రజల్ని మోసం చేస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ నాటకాలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఈ 12న జరగనున్న ఎన్నికల్లో బీజేపీని గెలిపించడం ద్వారా కాంగ్రెస్‌కు బుద్ధిచెప్పాలంటూ పిలుపునిచ్చారు. ఓటు బ్యాంకు రాజకీయాలతో కాంగ్రెస్‌.. దళితులు, ఓబీసీలకు శత్రువుగా మారిందన్నారు. అక్రమ మైనింగ్‌లతో ఎంతో దోచుకున్న పార్టీ కాంగ్రెస్‌ అని ఆరోపించారు. కాషాయ పార్టీకి ఓటేసి, బళ్లారి ప్రజలను ఎన్నో అవమానాలకు గురిచేసిన కాంగ్రెస్‌ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని మోదీ అభిప్రాయపడ్డారు.
బళ్లారిని బద్నాం చేసినవారిని శిక్షించాలా.. వద్దా?
దళారీలకు మేలు చేసేందుకే కాంగ్రెస్‌ ప్రభుత్వం పనిచేసిందని, రాష్ట్ర ప్రభుత్వం సరైన మైనింగ్‌ పాలసీ రూపొందించలేదని ప్రధానమంత్రి మోదీ విమర్శించారు. కాంగ్రెస్‌ ఉదాసీనత వైఖరి వల్లే బళ్లారి వెనుకబడిపోయిందన్నారు. బళ్లారిని బద్నాం చేసినవారిని శిక్షించాలా.. వద్దా? అని ప్రధాని ప్రశ్నించారు. బీజేపీ పాలనలోనే బళ్లారి అభివృద్ధి జరుగుతుందని ఆయన అన్నారు. నీతి, నిజాయితీకి ప్రతిరూపం బళ్లారి అని అన్నారు. రూ.50 కొత్త నోటుపై హంపి రూపాన్ని ముద్రించామన్నారు. తుంగభద్ర డ్యామ్‌ ఉన్నా తాగు, సాగునీరు అందడం లేదని మోదీ విమర్శించారు. డ్యామ్‌లో పూడిక తొలగించి ఉంటే సమస్య ఉండేది కాదన్నారు. నీటిసమస్యను పరిష్కరించి ఉంటే కాంగ్రెస్‌ ఓడిపోయే పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ చివరి కోట కూడా కూలిపోతుందని మోదీ వ్యాఖ్యానించారు. ముస్లిం అయిన అబ్దుల్‌ కలాంను రాష్ట్రపతి చేశామని, ఒక దళితుడిని రాష్ట్రపతిని చేస్తే కాంగ్రెస్‌ కలవరపడిందని ప్రధాని విమర్శించారు. దక్షిణాదికి చెందిన వెంకయ్య నాయుడును ఉపరాష్ట్రపతిని చేశామని ప్రధాని చెప్పారు. అలాగే దక్షిణాదికి చెందిన నిర్మలాసీతారామన్‌ను కూడా రక్షణమంత్రిని చేశామన్నారు. సిద్ధరామయ్య పార్టీలు మారిన వ్యక్తి అని ఎద్దేవా చేశారు. ఖర్గే సీఎం అవుతారనుకున్న దళితులు ఆశలపై కాంగ్రెస్‌ నీళ్లు చల్లిందన్నారు. నిజలింగప్ప విషయంలో కాంగ్రెస్‌ ఏం చేసిందో ప్రజలకు తెలుసునని ఆయన అన్నారు. ఓబీసీ ప్రజల డిమాండ్‌ను కాంగ్రెస్‌ పట్టించుకోలేదని మోదీ విమర్శించారు. ఓబీసీలకు చట్టసభలో అధికారం కోసం బిల్లు తెస్తే కాంగ్రెస్‌ అడ్డుకుందన్నారు.
————————————