కాంగ్రెస్‌, జేడీఎస్‌లు కలిసుంటాయనే నమ్మకం లేదు

– ఎప్పుడైన చీలక రావొచ్చు
– విభజన తరువాత విజయవాడ ఎంతో అభివృద్ధి చెందింది
– సినీ నటుడు, బీజేపీ నేత సాయికుమార్‌
– దుర్గమ్మను సతీసమేతంగా దర్శించుకున్న సాయికుమార్‌
విజయవాడ, సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి) : కర్ణాటకలో కాంగ్రెస్‌, జేడీఎస్‌లు కలిసి ఉంటాయన్న నమ్మకం తనకు లేదని నటుడు, బీజేపీ నేత సాయికుమార్‌ వ్యాఖ్యానించారు. మంగళవారం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ అమ్మవారిని సాయికుమార్‌ దంపతులు దర్శించుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పెళ్లి వేడుక నిమిత్తం విజయవాడ వచ్చినట్లు తెలిపారు. ‘నా స్వరం నాన్నగారిది, ఆయన స్పూర్తి నన్ను ఈ స్థాయిని తీసుకు వచ్చిందని అన్నారు. పుష్కరాల సమయంలో నా గొంతుకతో సేవ చేసే భాగ్యం కలిగిందన్నారు. సెలబ్రిటీలతో కాకుండా సామాన్యులతో కలిసి కార్యక్రమాలు చేయడం ఆనందంగా ఉందని అన్నారు. నా కుమారుడు ఆది మూడు సినిమాల్లో ప్రస్తుతం నటిస్తున్నాడని, రాజకీయాల్లో కూడా సినిమాల మాదిరిగా గెలుపు ఓటములు ఉంటాయని సాయికుమార్‌ పేర్కొన్నారు. దేశానికి మనం ఏం చేశాము అనే ఆలోచనతో ఉన్నానని, ప్రజలకు నాపై ఇంకా నమ్మకం కలగలేదని, అందుకే నన్ను గెలిపించలేదన్నారు. నాకు దేశభక్తి మెండుగా ఉందని, బీజేపీ సిద్ధాంతాన్ని నమ్మిన వాడినని తెలిపారు. కర్ణాటకలో కాంగ్రెస్‌, జేడీఎస్‌ల పొత్తు ఎంతోకాలం కొనసాగే పరిస్థితి ఉండదని, ఎప్పుడైనా విడిపోవచ్చునని అన్నారు. దేశంలో మోదీ పాలనను చూసి బీజేపీ పట్ల యువత ఆకర్షితులవుతున్నారని, రాబోయే కాలంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని సాయికుమార్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. విభజన తర్వాత
విజయవాడ బాగా అభివృద్ధి చెందిందని సాయికుమార్‌ వెల్లడించారు. రాజకీయంగా శత్రువులు లేకపోయినా ప్రత్యర్థులు ఉంటారని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఎప్పుడూ చెబుతూ ఉండేవారని గుర్తు చేసుకున్నారు.

తాజావార్తలు