కాంగ్రెస్ నాయకులపై.. అక్రమ కేసులు పెడితే సహించేది లేదు
– కేసీఆర్ కుటుంబ పాలనకు గోరీ కట్టాలి
– అధికారంలోకి రాగానే వడ్డీతో సహా కేసీఆర్ రుణం తీర్చుకుంటాం
– కాంగ్రెస్ కార్యకర్తల అభిష్టం మేరకు అభ్యర్థుల ఎంపిక
– పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి
వరంగల్, సెప్టెంబర్28(జనంసాక్షి ) : కాంగ్రెస్ నాయకులపై అక్రమ కేసులు పెడితే సహించేది లేదని టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. వరంగల్ జిల్లా హసన్ పర్తి మండలంలోని భీమారంలో శుక్రవారం తెలంగాణ మేధావుల సదస్సు జరిగింది. ‘టీఆర్‌ఎస్ వైఫల్యాలు-తెలంగాణ ప్రజల ఆకాంక్షలు’ అంశంపై నిర్వహించిన ఈ సదస్సులో ఉత్తమ్ మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం తమ తప్పులను ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. అక్రమంగా కేసులు పెట్టివారిని అణిచివేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఉత్తమ్ మండిపడ్డారు. అధికారంలోకి రాగానే వడ్డీతో సహా కేసీఆర్ రుణం తీర్చుకుంటామని ఉత్తమ్ హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబ పాలనకు గోరీ కట్టాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. ఈవీఎంల పనితీరును కార్యకర్తలు శ్రద్ధగా పరిశీలించాలని అన్నారు. కార్యకర్తల అభీష్టం మేరకే కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని ఉత్తమ్ చెప్పారు. ఇప్పటికే పలు విధాలుగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేయడం జరిగిందని, పార్టీ నిర్వహించిన సర్వేల ద్వారా కార్యకర్తల అభిష్టాన్ని దృష్టిలో ఉంచుకొని అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని అన్నారు. టీఆర్‌ఎస్ పాలనలో నాలుగేళ్లుగా ప్రజలకు ఒరిగిందేవిూ లేదని ఉత్తమ్ అన్నారు. అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన కేసీఆర్.. ఇప్పటికీ లక్ష ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయని అన్నారు. తెరాస హయాంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. ప్రజల ఇష్టాఇష్టాలను తెలుసుకోకుండా ఏకపక్ష పాలన సాగించిన కేసీఆర్‌కు గుణపాఠం చెప్పేందుకు ప్రజలంతా ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని ఉత్తమ్ అన్నారు.