కాంగ్రెస్ పాలనలోనే రైతుల ఆత్మహత్యలు
ఆదిలాబాద్, జనవరి 31 (): కాంగ్రెస్ పాలనలోనే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు రాంచందర్ ఆరోపించారు. భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర నిర్మల్ నియోజకవర్గంలోని టోన్ గ్రామానికి చేరుకున్న సందర్భంగా పాదయాత్ర బృందాన్ని కలిసి తమ మద్దతును తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల కోసం చేపట్టిన పాదయాత్ర వల్ల ప్రభుత్వాలు మేలుకొనాలని ఆయన అన్నారు. ప్రభుత్వ విధానాల వల్ల, రైతుల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరిస్తునందున రైతాంగం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఒకవైపు వ్యవసాయ పెట్టుబడులు పెరిగి మరోపక్క ఎరువుల ధరలు పెరగడం, పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతుల పరిస్థితి అస్తవ్యస్తంగా మారిందని అన్నారు. రైతులను విస్మరించిన ప్రభుత్వాలకు పుట్టగతులు ఉండవని ఆయన హెచ్చరించారు. ఈ రైతు పాదయాత్ర వల్ల సామాన్య ప్రజల్లో, రైతుల్లో చైతన్యం వచ్చి పాలకవర్గాలకు తగిన బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.