కాంగ్రెస్‌ మంత్రులు రాజీనామా చేయాలి

ఆదిలాబాద్‌్‌, జనవరి 30 (): ప్రజల ఆకాంక్ష మేరకు పదవులను త్యాగం చేసి తెలంగాణ కోసం పోరాటం చేస్తామని చెప్పిన కాంగ్రెస్‌ నాయకులు కేంద్ర ప్రకటనతో రాజీనామాలు చేయాల్సి ఉండగా, అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రాంనాథ్‌ పేర్కొన్నారు. కేంద్రం విధించిన గడువులోగా తెలంగాణను ప్రకటించకపోగా ప్రజల మనోభావాలకు విరుద్దంగా కేంద్ర మంత్రులు ప్రకటన చేయడాన్ని ఆయన ఖండించారు. ఇచ్చేది, తెచ్చేది కాంగ్రెస్‌ పార్టీ అంటూ ప్రకటన చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు కేంద్రం ప్రకటనతో రాజీనామాలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రజలను మోసపూరిత మాటలతో నమ్మించాలని చూస్తున్న వారి ఆటలు సాగవని ప్రజలు తగిన రీతిలో గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్‌ నాయకులు ప్రజల అభిష్టానికి విరుద్దంగా వ్యవహరిస్తే గ్రామాల్లో తిరగనివ్వమని ఆయన హెచ్చరించారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి తమ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ కోసం ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన తెలిపారు.