కాంగ్రెస్‌ ర్యాలీకి పోటీగా ఎన్‌డిఎ ఆందోళన

గాంధీ విగ్రహం ముందు నిరసనలు

వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఘనత కాంగ్రెస్‌దే అన్న వెంకయ్య

న్యూఢిల్లీ,మే6(జ‌నంసాక్షి): సేవ్‌ డెమాక్రసీ పేరుతో కాంగ్రెస్‌ ఆందోళనకు దిగితే … కాంగ్రెస్‌ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా బీజేపీ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద వీరు దీక్షలో కూర్చుని నిరసన తెలిపారు. దీక్షలో బీజేపీ నేతలతో పాటు ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలు పాల్గొన్నారు. 2జీ కుంభకోణం, బొగ్గుగనుల కుంభకోణంతో పాటు యూపీఏ హాయంలో జరిగిన కుంభకోణాల సరసన తాజాగా అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ అవినీతి చేరిన విషయం తెలిసిందే. బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా నేతలు డిమాండ్‌ చేసారు. కాంగ్రెస్‌ నేతల అవినీతిని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. కుంభకోణాల కాంగ్రెస్‌ అంటూ నినదించారు. కుంభకోణాల భోక్తలను బయట పెట్టాలన్నారు. ఇదిలావుంటే

దేశంలో ఎమర్జెన్సీ పెట్టి లక్షలాది మందిని జైల్లో పెట్టిన ఘనత కాంగ్రెస్‌ దేనని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. ఢిల్లీలో శుక్రవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, ఏఐసీసీ ఉపాధ్యక్షడు రాహుల్‌ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ చేపట్టిన ‘సేవ్‌ డెమోక్రసీ ర్యాలీ’పై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందన్నారు. సీబీఐ, నిఘా విభాగాలను తన అవసరాలకు కాంగ్రెస్‌ వాడుకుందంటూ మండిపడ్డారు. రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి సీబీఐని ఉపయోగించిందని, నేతలను జైళ్లలో పెట్టిందని వెంకయ్య ఆరోపించారు. రాజ్యాంగాన్నిఇష్టానుసారంగా సవరించిన చరిత్ర కాంగ్రెస్ది అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజల హక్కులను హరించిన వాళ్లు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారా అంటూ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన కాంగ్రెస్‌ నేడు సేవ్‌ డెమోక్రసీ అంటోందని కేంద్ర మంత్రి వెంకయ్య ఎద్దేవా చేశారు.