కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్, లోక్ సభ వాయిదా

apmy4ct0లోక్ సభ కూడా రేపటికి వాయిదా పడింది. మధ్యాహ్నం వాయిదా తర్వాత తిరిగి 2 గంటలకు ప్రారంభమైన సభలో పరిస్థితి మారలేదు. లలిత్ గేట్, వ్యాపం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కుంటున్న సుష్మా, వసుంధర, చౌహాన్ లపై చర్యలు తీసుకోవాల్సిందేనని కాంగ్రెస్ సభ్యులు పట్టుపట్టారు. ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. మరోవైపు, హైకోర్టు విభజన కోరుతూ టిఆర్ఎస్ ఎంపీలు నిరసన కొనసాగించారు. దీంతో, స్పీకర్ సుమిత్రా మహాజన్ సభ్యులను పదేపదే హెచ్చరించారు. ప్లకార్డులు ప్రదర్శిస్తే చర్యలు తీసుకుంటానని చెప్పారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అయినా, విపక్షాలు వెనక్కి తగ్గలేదు. దీంతో, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రతిపాదించకుండానే లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ 27 మంది కాంగ్రెస్ పార్టీ సభ్యులను ఐదు రోజులపాటు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. సభను రేపటికి (మంగళవారం) వాయిదా వేశారు.