కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఛాన్స్ ఇవ్వండి
రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన కేసీఆర్
– టిపిసిసి స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి
మిర్యాలగూడ. జనం సాక్షి :
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఛాన్స్ ఇవ్వండని టీపీసీసీ స్టార్ క్యాంపెనర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. గురువారం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మీడియాతో మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే వరంగల్ డిక్లరేషన్ తో పాటు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేని టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని అన్నారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, కేజీ టు పీజీ విద్య, దళితబంధు ఇలా అనేక రకాల పథకాల పేర్లతో ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. పూటకో వేషం వేస్తూ ఎన్నికలప్పుడు మరో వేషం వేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కెసిఆర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు అప్పుల పాలు చేశారని ఆరోపించారు. సోనియా గాంధీ పుణ్యం తోటే ప్రస్తుతం ఉపాధి హామీ పనుల ద్వారా రాష్ట్రంలో పేద ప్రజలు బతుకుతున్నారని తెలిపారు. తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచే వారికి టికెట్లు ఇస్తారని, సర్వేల ఆధారంగా పార్టీ టికెట్లు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. పనిచేసే వారికి టికెట్లే కాదు… పదవులు కూడా వాటంతట అవే వస్తాయని తెలిపారు.
కోమటిరెడ్డి ఘన స్వాగతం :
మాజీ మంత్రి, యాదాద్రి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెనైర్ గాఎంపికై తొలిసారి మిర్యాలగూడ పట్టణానికి గురువారం విచ్చేసిన సందర్భంగా వెంకట్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఆయన అభిమాన సంఘం, కాంగ్రెస్, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్ యుఐ, అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు, మిర్యాలగూడ పట్టణంలోని రామచంద్ర గూడెం వై జంక్షన్ నుండి బైపాస్ హనుమాన్ పేట మీదుగా ద్విచక్ర వాహనాల ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్ శ్రేణులు అభిమానులు పూలు జల్లుతూ కాంగ్రెస్ పార్టీ జెండాలతో వెంకటరెడ్డికి అపూర్వ స్వాగతం పలికారు. వెంకటరెడ్డి సైతం ఓపెన్ టాప్ జీప్ లో అందరికీ అభివాదం చేస్తూ నాయకులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అభిమానులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్ యుఐ నాయకులు, శ్రేణులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Attachments area