కాంగ్రెస్ పార్టీ కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు; మంత్రి తలసాని
హైదరాబాద్ (జనం సాక్షి): కాంగ్రెస్ పార్టీ ఇచ్చే హామీలన్నీ ఆచరణ సాధ్యం కానివేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అది ఏమన్నా కొత్త పార్టీయా అని ప్రశ్నించారు. వారి చరిత్ర ఎవరికి తెలయదని, ఆ పార్టీని తెలంగాణలోని కానీ, దేశంలో కానీ ఎవరూ నమ్మే స్థితిలో లేరని విమర్శించారు. హైదరాబాద్ గోషామహల్‌లో బీసీ కులవృత్తిదారులకు ఆర్ధిక సహాయం పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఓట్లు దండుకోవడం తప్ప ఏరోజూ ప్రజల గురించి కాంగ్రెస్ ఆలోచించలేదన్నారు. 50 ఏండ్లపాటు రాష్ట్రాన్ని పరిపాలించారని, అప్పుడు పేదలకు పెన్షన్లు ఇవ్వాలనే ఆలోచన రాలేదా అని నిలదీశారు.
గృహలక్ష్మి పథకంలో భాగంగా ఇండ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.3 లక్షలు ఇస్తుంటే.. వాళ్లు రూ.6 లక్షలు ఇస్తామని చెప్పడం ఎంతవరకు సబబన్నారు. ఆ పార్టీ నాయకులు కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారం కోసం ఊకదంపుడు ఉపన్యాసాలు, అలవికాని హామీస్తున్నారని విమర్శించారు. కర్ణాటక ఎన్నికల్లో కూడా ఇలాంటి హామీలే ఇచ్చారని, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత చేతులెత్తేశారని చెప్పారు. ఆ పార్టీ ప్రకటించే డిక్లరేషన్లు కనీసం మూతి తూడ్చుకోవడానికి కూడా పనికిరావని ఎద్దేవా చేశారు. అన్నివర్గాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషిచేస్తున్నారని చెప్పారు. వచ్చే నెల 2న 12 వేల డబుల్‌బెడ్ రూం ఇండ్లు పంపిణీ చేస్తామని వెల్లడించారు.