కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ పచ్చి బూటకం : మంత్రి కొప్పుల ఫైర్‌

హైదరాబాద్‌ : ఎన్నికలకు ముందు దళితులను, గిరిజనులను కాంగ్రెస్ డిక్లరేషన్ పేరిట మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నదని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ విమర్శించారు. శుక్రవారం బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. దేశంలో 40 కోట్ల మందికి పైగా దళిత, గిరిజనులు ఉన్నారు. 50 సంవత్సరాలకు పైగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ దళిత, గిరిజనులను మోసం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ మాటలు నమ్మేందుకు దళిత, గిరిజనులు అమాయకులు కారన్నారు.

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఎస్సీ,ఎస్టీ డిక్లరేషన్‌ తెలంగాణలో కాకుండా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో దేశ వ్యాప్తంగా ఈ డిక్లరేషన్ విడుదల చేయాల్సి ఉండేదన్నారు. ఇప్పుడు డిక్లరేషన్‌ పేరుతో హడావుడీ చేస్తున్నా ఆ పార్టీ.. ఇన్నేళ్లు ఈ పథకాలు అమలు చేయాలనే ఆలోచన ఎందుకు రాలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో దళిత, గిరిజన విద్యార్థుల కోసం రెసిడెన్షియల్ పాఠశాలలు, కాలేజీలు ఎన్ని పెట్టారో లెక్క చెప్పాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మొత్తం 1006 రెసిడెన్షియల్ స్కూ్ల్స్‌ పెట్టిందని స్పష్టం చేశారు.

ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో దళిత, గిరిజనులకు అడ్మిషన్లు దొరుకుతున్నాయంటే అది రెసిడెన్షియల్ విద్యా ఫలితమేనని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో దళిత బంధు లాంటి పథకం ఎందుకు లేదు..దళిత బంధు కోసం 12 లక్షల రూపాయలు కాదు, కాంగ్రెస్‌కు దమ్ముంటే తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఐదు లక్షలు ఇస్తే చాలని సవాల్‌ విసిరారు. కేవలం ఎన్నికలు ఉన్నాయనే తెలంగాణలో డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ డ్రామాలు ఆడుతున్నదని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్‌కు ఓట్ల మీద ప్రేమ తప్పా దళితుల మీద లేదన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా దళిత, గిరిజనుల అభివృద్ధి జరుగుతున్నదని పేర్కొన్నారు.

బీఆర్‌ఎస్‌ పథకాలకు కాపీ కొట్టి ఎదో చేస్తామని కాంగ్రెస్ భ్రమలు కల్పిస్తున్నది. వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీఆర్‌ఎస్‌ పార్టీనే అధికారంలోకి వచ్చి, మరింత సమర్థవంతంగా పథకాలు అమలు చేస్తామన్నారు. ఎనిమిదేళ్లలో దళిత బంధు అన్ని దళిత కుటుంబాలకు వర్తింపజేస్తామన్నారు. కాంగ్రెస్ డిక్లరేషన్ ఓ బూటకమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత బంధులో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నదనేది దుష్ప్రచారం మాత్రమే. ఎన్నికలు ఎలా వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. 115 మంది అభ్యర్థులతో జాబితా విడుదల చేసుకోవడం మా ఎన్నికల సంసిద్ధతకు నిదర్శనమని మంత్రి తెలిపారు.