కాట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం

మంచిర్యాల, అక్టోబరు 28 జనం సాక్షి : కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. మంచిర్యాల పట్టణంలోని చార్వాక ట్రస్టు హాల్‌లో గురువారం నిర్వహించిన తెలంగాణ కార్మిక సంఘాల రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన  మాట్లాడారు. కాంట్రాక్టు కార్మికుల వేతన సవరణ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యధోరణి వహిస్తోందన్నారు. పర్మనెంటు ఉద్యోగులతోపాటు కాంట్రాక్టు కార్మికులకు వేతన సవరణ చేయాలని సమాన పనికి సమాన వేతనాలు చెల్లించాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నాయన్నారు. వాటిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంటు చేయాలని  కోరడం లేదని,  పర్మనెంటు ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. పీఆర్‌సీ కమిటీ రాష్ట్రంలో లక్షకు పైగా ఉన్న కాంట్రాక్టు, టెంపరరీ, టైంస్కేల్‌ ఉద్యోగులకు వేతన సవరణ చేయాలని ప్రభుత్వానికి సూచించిందన్నారు. సింగరేణిలో ప్రైవేటీకరణకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు. ప్రైవేటీకరణ వల్ల కొందరు వ్యాపారులు లాభపడి ప్రభుత్వాలను శాసిస్తారన్నారు. కేంద్రంలో అంబానీ, ఆదానీలు, రాష్ట్రంలో మెగా ఇంజనీరింగ్‌ కంపెని ప్రభుత్వాలను తమ గుప్పిట్లో ఉంచుకుని తమకు  అనుకూలంగా విధానాలను రూపొందిస్తున్నారన్నారు.  కరోనా వల్ల గడిచిన రెండు సంవత్సరాలుగా చిరు వ్యాపారులు ప్రైవేటు, కాంట్రాక్టు ఉద్యోగులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారన్నారు. గత సంవత్సరం ఉపాధిహామీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు సమ్మె చేస్తే రాష్ట్ర ప్రభుత్వం 7,500 మందిని  విధుల నుంచి తొలగించిందన్నారు. సంవత్సర కాలంలో రాష్ట్రంలో 20 మంది నిరుద్యోగులు ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. కార్మికులు, ఉద్యోగులు ఐక్యంగా పోరాడి హక్కులను సాధించుకోవాలన్నారు. రాష్ట్రంలో యువతకు ఉపాధి లేక ఆగమవుతున్నారన్నారు.  ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఫీజులను ప్రభుత్వమే చెల్లించాలని, తద్వారా ప్రైవేటు పాఠశాలల సిబ్బందికి ఉపాధి దొరుకుతుందన్నారు. ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలను పెంచి  రూ.40 వేల కోట్ల నుంచి రూ. 1లక్ష25 వేల కోట్లకు పెంచి కాంట్రాక్టు కంపెనీ మెగా ఇంజనీరింగ్‌కు లబ్ధి చేకూర్చిందని ఆరోపించారు. సమావేశంలో   సంఘాల ప్రతినిధులు, కార్మిక నాయకులు దేవి సత్యం, జైపాల్‌సింగ్‌, బాబన్న, తెలంగాణ జన సమితి నాయకులు పాల్గొన్నారు.