కాపీ కొట్టడంలో మోడీ ఫస్ట్‌

విమర్శలకు పదను పెట్టిన రాహుల్‌
న్యూఢిల్లీ,మే7(జ‌నం సాక్షి): మరో ఐదు రోజుల్లో కర్ణాటకలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్‌, భాజపాల మధ్య మాటల పోరు మరింత ముదురుతోంది. మోడీ విమర్శలకు దీటుగా రాహుల్‌ ప్రతి విమర్శలు చేస్తూ మోడీని దుయ్యబడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా  కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన మోదీపై కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ట్వీట్ల దాడికి దిగారు.
ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక కింద మొత్తం జనాభాలో 24శాతం వనరులు దళితులు, ఆదివాసీలకు అందేటట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని తీసుకువచ్చింది. 2013లో ఈ చారిత్రక నిర్ణయాన్ని తీసుకుంది. ఐదేళ్లలో ఇందుకోసం రూ.88,385 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. అయితే మోదీ మాత్రం ఈ పని చేసింది భాజపా ప్రభుత్వమేనని చెప్పుకొని తిరుగుతున్నారు. మోదీ ఈ మధ్య కాపీ కొట్టడం కూడా నేర్చుకున్నారు అని రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. మరో ట్వీట్‌లో భాజపా ప్రభుత్వం 2014 నుంచి ఇప్పటి వరకూ పెట్రోల్‌, ఎల్‌పీజీ, డీజిల్‌లపై రూ.10లక్షల కోట్లు పన్ను రూపంలో వసూలు చేసింది. ఇప్పటికీ పెట్రోల్‌ ధరలు నియంత్రించలేకపోగా… సామాన్యులకు ఇది గుది బండలా మారుతోంది. కావాలంటే ఈ వీడియో చూడండి. ఈ రోజు మధ్యాహ్నం కోలార్‌లో వీటికి వ్యతిరేకంగా నేను నిరసన తెలపబోతున్నాను అని ట్వీట్‌లో పేర్కొన్నారు. త్వరలో కర్ణాటక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇరు పార్టీలు ఇలాంటి అంశాలను అజెండాగా చేసుకుని మాటల యుద్దానికి దిగుతున్నాయి. రాష్ట్రంలోని 224అసెంబ్లీ స్థానాలకు గానూ ఈనెల 12న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఫలితాలు మే 15న వెలువడనున్నాయి. దీంతో ఇక్కడ ప్రచార¬రు ఊపందుకుంది.