కాపులను చంద్రబాబు మోసం చేస్తున్నాడు
కాపు రిజర్వేషన్ల బిల్లును మొక్కుబడిగా కేంద్రానికి పంపాడు
మాజీ మంత్రి ముంద్రగడ పద్మనాభం
శ్రీకాకుళం, జూన్13(జనం సాక్షి) : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాపులను మోసం చేస్తున్నారని, రిజర్వేషన్లు ఇవ్వకపోవడంతో పాటు తమను ఇష్టమొచ్చినట్లు తిడుతున్నారని మాజీ మంత్రి, కాపు రిజర్వేషన్ల ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మండిపడ్డారు. కాపు బిల్లును మొక్కుబడిగా కేంద్రానికి పంపారని, అందులో సరైన సమాచారం లేదని కేంద్రం వెనక్కి పంపడం నిజం కాదా అని చంద్రబాబును ముద్రగడ ప్రశ్నించారు. ముద్రగడ బుధవారం విూడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును చిత్తుగా ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీతో తగాదా వచ్చాక మా బిల్లును మొక్కుబడిగా కేంద్రానికి పంపారంటూ మండిపడ్డారు. ప్రస్తుతం రాజస్తాన్, గుజరాత్, హరియాణా తరహాలో కాకుండా గతంలో ఉన్న రిజర్వేషన్లనే కాపులు అడుగుతున్నారని ఈ సందర్భంగా కాపు ఉద్యమనేత గుర్తుచేశారు. ‘1910వ సంవత్సరం (బ్రిటీష్ కాలం) నుంచి మా జాతికి రిజర్వేషన్ ఉందని, ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో కూడా మాకు రిజర్వేషన్ కల్పించారన్నారు. అప్పటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య హయాంలోనూ రిజర్వేషన్ ఉందని, కానీ బీసీలుగా ఉద్యోగాలు పొంది, ఓసీలుగా కాపులు పదవీ విరమణ చేస్తున్నారన్నారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు పార్టీని చిత్తుగా ఓడించాలని, 2019 ఎన్నికలకు నాలుగు నెలల ముందు మా రిజర్వేషన్లపై సృష్టత ఎవరు యిస్తారో, అప్పుడు మా కాపు జాతితో పాటు ఇతర సామాజిక వర్గాల పెద్దలతో చర్చించి తదుపరి కార్యచరణ ప్రకటిస్తామని’ ముద్రగడ పేర్కొన్నారు.