కామన్వెల్త్‌ హెవీ వెయిట్‌లిఫ్టింగ్‌ కేటగిరీలో సుధీర్‌ బంగారు పతకం కైవ‌సం

పారా వెయిట్‌లిఫ్టర్ సుధీర్‌ తొలిసారి కామన్వెల్త్‌ హెవీ వెయిట్‌లిఫ్టింగ్‌ కేటగిరీలో బంగారు పతకం సాధించాడు.

మొదటి ప్రయత్నంలో 208 కేజీలను ఎత్తిన సుధీర్‌.. రెండో ప్రయత్నంలో 212 కేజీలను విజయవంతంగా లిఫ్ట్‌ చేశాడు. మూడో ప్రయత్నంలో 217 కేజీలకు ప్రయత్నించినా సఫలం కాలేదు. అయితే మొత్తం 134.5 పాయింట్లు సాధించిన సుధీర్‌ స్వర్ణపతకం నెగ్గాడు. దీంతో భారత్‌ ఖాతాలో ఆరో బంగారు పతకం చేరింది. మొత్తం పతకాల సంఖ్య 20 అయింది. అందులో ఆరు స్వర్ణాలు, ఏడేసి రజత, కాంస్య పతకాలు ఉన్నాయి.

సుధీర్‌ బంగారు పతకం సాధించడంతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి హర్‌దీప్‌ సింగ్ పురి శుభాకాంక్షలు తెలిపారు. ”కామన్వెల్త్‌ పారా గేమ్స్‌లో అద్భుత ప్రారంభం. స్వర్ణ పతకం గెలిచిన సుధీర్‌ పట్టుదల, స్ఫూర్తి ప్రతి ఒక్కరికీ అనుసరణీయం. భవిష్యత్తులో మరిన్ని విజయాలను నమోదు చేయాలని ఆకాంక్షిస్తూ.. శుభాకాంక్షలు తెలియజేస్తున్నా” అని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. పారా వెయిట్‌లిఫ్టింగ్‌లో మొదటి పతకం అందించిన సుధీర్‌ ప్రదర్శనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.