కార్గిల్ వీరులకు ప్రముఖుల నివాళి
న్యూఢిల్లీ 16 జులై (జనంసాక్షి):
కార్గిల్ యుద్ధంలో మృతి చెందిన అమరవీరులకు ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు సెల్యూట్ చేస్తున్నానని మోడీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కార్గిల్ విజయ్ దివస్ భారత సైనికుల పరాక్రమాన్ని, ఆత్మత్యాగాన్ని గుర్తు చేస్తుందన్నారు. ఆకాశవాణిలో ప్రసారమైన మన్‌కీబాత్ కార్యక్రమంలోనూ ప్రధాని కార్గిల్ వీరులను స్మరించుకున్నారు. కార్గిల్ యుద్ధం జరిగి 16 ఏళ్లు పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మోడీ అమరవీరులకు నివాళులర్పించారు. రక్షణ మంత్రి నివాళి కాగా, విజయ్‌దివస్ సందర్భంగా కార్గిల్ అమరవీరులకు జాతి ఘనంగా నివాళులర్పించింది. న్యూఢిల్లీలోని అమర్ జవాన్ జ్యోతి వద్ద రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్, ఆర్మీ ఛీఫ్ జనరల్ దల్బీర్ సింగ్, ఎయిర్ ఛీఫ్ మార్షల్ అరుప్ రాహ, నేవీ ఛీఫ్ ఆర్‌కె ధోవన్ కార్గిల్ యుద్ధవీరులకు నివాళులర్పించారు. రోడ్డు ప్రమాదాలపై అవగాహన అవసరం, తొలి 50 గంటలు ఉచిత వైద్యం రోడ్డు ప్రమాదం జరిగితే తొలి 50 గంటల పాటు బాధితులకు ఉచిత వైద్యం అందించాలని కేంద్రం యోచిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. తొలుత ఈ పథకాన్నిగుర్గావ్, జైపూర్, వడోదర, ముంబై, రాంచీ తదితర ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా చేపడ్తామని చెప్పారు. అదే సమయంలో త్వరలో రోడ్ సేఫ్టీ బిల్లు కూడా తెస్తామన్నారు. ఆకాశవాణి మన్‌కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ చిన్నారుల్లో రోడ్డు భద్రతపైన అవగాహన తీసుకొచ్చేందుకు పెద్దలు ప్రయత్నించాలని చెప్పారు. దేశంలోని ప్రతి గ్రామానికీ నిరంతర విద్యుత్ అందించే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజనను అమలు చేసి తీరతామన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన తన ప్రసంగంలో ప్రస్తావించేందుకు సలహాలు, సూచనలు తనకు పంపాలని ప్రధాని కోరారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికోసం విలువైన సూచనలు పంపుతున్న వారికి ఈ సందర్భంగా ప్రధాని ధన్యవాదాలు తెలిపారు.