కార్తికేయ`2 మోషన్‌ పోస్టర్‌ విడుదల


యంగ్‌ హీరో నిఖిల్‌ సిద్దార్ధ గత చిత్రం ’అర్జున్‌ సురవరం’ మంచి విజయం సాధించింది. ఫేక్‌ సర్టిఫికెట్స్‌ స్కామ్‌ నేపథ్యంలో ఆసక్తికరమైన కథాకథనాలతో ఈ సినిమా ప్రేక్షకుల్ని విశేషంగా అలరించింది. ప్రస్తుతం నిఖిల్‌ ముచ్చటగా మూడు చిత్రాల్లో నటిస్తున్నాడు. వీటిలో ’కార్తికేయ 2’ చాలా ప్రత్యేకమైన చిత్రం. ఎనిమిదేళ్ళ క్రితం విడుదలైన ’కార్తికేయ’ చిత్రానికిది సీక్వెల్‌ అన్న సంగతి తెలిసిందే. మొదటి భాగం ప్రేక్షకుల్ని బాగా థ్రిల్‌ చేయడంతో.. అంతకు మించిన స్థాయిలో కథాకథనాల్ని రెండో భాగం కోసం సిద్ధం చేశారు. మొదటి భాగం తెరకెక్కించిన చందు మొండేటి రెండో భాగానికీ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ సినిమా మరో ప్రత్యేకత ఏంటంటే.. దీన్ని పాన్‌ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సైతం విడుదల చేయబోతున్నారు. జూన్‌ 1 నిఖిల్‌ పుట్టినరోజు సందర్భంగా.. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ మోషన్‌ పోస్టర్‌ ను విడుదల చేయడంతో పాటు.. సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు మేకర్స్‌. ఒక షిప్‌ లో హీరో నిఖిల్‌, శ్రీనివాసరెడ్డి, అనుపమా పరమేశ్వరన్‌ ఏదో మిషన్‌ పై బైలుదేరుతున్న లుక్‌ ఆకట్టుకుంటోంది. ఇక ’కార్తికేయ 2’ చిత్రాన్ని జూలై 22న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌ లో విడుదల చేయబోతున్నారు. మొదటి భాగంలో స్వాతి రెడ్డి కథానాయికగా నటిస్తే.. రెండో భాగంలో మలయాళ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్‌ గా నటించనుండడం విశేషం. శ్రీకృష్ణ తత్వంపై ఎపిక్‌ డివోషనల్‌ జెర్నీగా ఈ సినిమా తెరకెక్కనున్నదని పేర్కొన్నారు మేకర్స్‌. పీపుల్స్‌ విూడియా ఫ్యాక్టరీ , అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ బ్యానర్స్‌ పై సంయుక్తంగా ఈ సినిమా నిర్మాణం జరుపుకుంటోంది. కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నిఖిల్‌ కు ఏ స్థాయిలో సక్సెస్‌ అందిస్తుందో చూడాలి.