కార్తీకి ఢిల్లీ కోర్టులో తాత్కాలిక ఊరట 

న్యూఢిల్లీ, మే2( జ‌నం సాక్షి) : 2జీ కుంభకోణంలో భాగమైన ఎయిర్‌సెల్‌ మ్యాక్సిస్‌ కేసులో కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి తాత్కాలిక ఊరట లభించింది. సీబీఐ, ఈడీ అరెస్టుల నుంచి కల్పించిన రక్షణను ఢిల్లీ కోర్టు జులై 10వరకు పొడిగించింది. ముందస్తు బెయిల్‌ కోసం కార్తీ చేసిన దరఖాస్తుపై వాదనలు వినిపించేందుకు మరింత సమయం కావాలన్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విజ్ఞప్తి నేపథ్యంలో ప్రత్యేక న్యాయస్థానం ఈమేరకు మరింత ఉపశమనం కల్పించింది. పెట్టుబడి పెట్టేందుకు గ్లోబల్‌ కమ్యూనికేషన్‌ ¬ల్డింగ్స్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌కు కార్తీ చిదంబరం అక్రమంగా అనుమతులు ఇప్పించారన్నది ప్రధాన అభియోగం. ఈ వ్యవహారంపై 2011లో సీబీఐ, 2012లో ఈడీ కేసులు నమోదు చేశాయి. ఆయా కేసుల్లో ముందస్తు బెయిల్‌ కోసం కార్తీ దరఖాస్తు చేయగా.. అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ ఏప్రిల్‌ 16న న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. కాగా బుధవారం ఆ మినహాయింపును జులై 10వరకు పొడిగించింది.