కార్మికులు హక్కుల అణచివేత తగదు

ఉపాధి కోల్పోతున్న నిర్మాణరంగ కార్మికులు

విజయవాడ,నవంబర్‌19(జనం సాక్షి): నిర్మాణరంగ కార్మికులు ఆందోళనకు సిద్దం అవుతున్నారు. నిర్మాణ రంగ మెటీరియల్‌పై విపరీత భారం పెరిగిందని, ప్రభుత్వం ఆ భారాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇసుక కొరత ఇప్పటికే నిర్మాణ రంగ కార్మికులనడడ్‌ఇ విరిచిందన్నారు. గ్రీన్‌ బెల్ట్‌ పేరుతో సుప్రీం కోర్టు తీర్పును అడ్డు పెట్టుకుని ప్రభుత్వం మైనింగ్‌ను పూర్తిగా నిలిపివేసిందన్నారు. ఇందువల్ల నిర్మాణరంగం సహా, రియల్‌ ఎస్టేట్‌ రంగం కూడా దెబ్బతింటోందని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రభుత్వం మైనింగ్‌కు అనుమతులు ఇవ్వాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ బోర్డు పేరును రాష్ట్ర ప్రభుత్వాల నేతలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం వారి పేర్లను పెట్టుకోవడాన్ని ఖండించారు. సంక్షేమ బోర్డు నిధులను పక్కకు మళ్ళిస్తున్నారని ఆరోపించారు. కార్మికులు తమ హక్కులను కోల్పోయేలా చట్టాల్లో తీసుకొస్తున్న మార్పులను వ్యతిరేకించాలని సూచించారు. కార్మికుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు మత ఘర్షణల చిచ్చు పెడుతున్నారని, వీటిని తిప్పికొట్టి ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా దాదాపు ఆరుకోట్ల మంది నిర్మాణరంగ కార్మికులుంటే వారిలో రెండు కోట్ల మంది మాత్రమే కార్మికుల సంక్షేమ బోర్డులో నమోదయ్యారని బిల్డింగ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వి. ఉమామహేశ్వర రావు, సి. నర్సింహరావులు తెలిపారు. కేవలం మూడింట ఒక వంతు మంది కార్మికులే ఈ బోర్డులో రిజిస్టర్‌ అయ్యారని, మిగిలిన వారినీ నమోదు చేయించే బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపారు. ఈ బోర్డు ద్వారా పూర్తి స్థాయిలో ఆ రంగంలోని కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం నిధులను వెచ్చించడంలేదని ఆయన విమర్శించారు. ఇంతవరకు రూ. 35 వేల కోట్లు సెస్‌ రూపంలో వసూలు చేస్తే, ఆ నిధుల్లో బోర్డు కేవలం రూ. 7 కోట్లు మాత్రమే ఈ కార్మికుల సంక్షేమానికి వ్యయం చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం విస్తృత స్థాయిలో సెస్‌ వసూలు చేయడంలేదని, వసూలుచేసిన దాంట్లోనూ పూర్తిగా నిర్మాణరంగ కార్మికుల సంక్షేమానికి వెచ్చించడంలేదని విమర్శించారు. ప్రభుత్వం సెస్‌ ద్వారా విస్తృత స్థాయిలో సెస్‌ వసూలు చేయాలని, ఆ మొత్తాన్ని నిర్మాణరంగ కార్మికుల పిల్లల విద్య, ఇళ్ల నిర్మాణం, ఆరోగ్యం తదితర సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.