కార్మికుల వేతనాలపై రాజీలేదు

విశాఖపట్టణం,జూన్‌13(జ‌నం సాక్షి): ముఠాకార్మికుల సమస్యలు పరిస్కరించాలని, వారికి కూలిరేట్లు పెంచాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ అన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలి రేట్లు పెంచాలని డిమాండ్‌ చేశారు. వ్యాపారులు ధరలు పెంచి అమ్ముతున్నా పట్టించుకునే నాధుడే లేవరన్నారు. కానీ కార్మికులకు కూలి పెంచమంటే నానా హైరానా చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నో రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నా యజమానులకు పట్టకపోవడం అన్యాయమన్నారు. ప్రభుత్వం, అధికారులు వారికి అండగా ఉన్నారన్న నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇటువంటి పరిస్థితుల్లో కార్మికులు ఎలాంటి అన్యాయం జరిగినా సహించేదని హెచ్చరించారు.కార్మికులు సమ్మె చేస్తుంటే బయట వ్యక్తుల చేత పనులు చేయిస్తే ఊరుకోమన్నారు. కార్మికుల జీవన్మరణ సమస్యను చులకనగా చూస్తే సహించేది లేదన్నారు. సమస్యల పరిష్కారానికి కార్మికులకు పోరాటమే శరణ్యమని, ఈ విషయంలో సమైక్యంగా ముందుకు సాగాలన్నారు. ఇదిలావుంటేవేతనాలు పెంచాలని పాడేరు ఆశా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. తక్కువ వేతనంతో ఏళ్ల తరబడి ఆశా కార్యకర్తలు గ్రామాల్లో వైద్యసేవలు అందిస్తున్నా ప్రభుత్వం కనికరించకపోవడం దారుణమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆశా కార్యకర్తలకు రూ.6 వేల వేతనం చెల్లిస్తుంటే ఆంధ్రాలో మాత్రం కేవలం రూ.400 మాత్రమే చెల్లిస్తున్నారని చెప్పారు. ఈ వేతనం కూడా నెలల తరబడి చెల్లించకపోవడంతో ఆశాల కుటుంబ పోషణకష్టతరంగా మారిందన్నారు. బకాయి వేతనాలు చెల్లిస్తామని గతంలో ప్రభుత్వం, అధికారులు హావిూలిచ్చినా వాటిని నేటి వరకు నెరవేర్చలేదన్నారు. యూనీఫాం అలవెన్సులు కూడా చెల్లించలేదని, తక్షణమే ఆశా కార్యకర్తలకు వేతనాలు పెంచాలని ఆమె డిమాండ్‌ చేశారు.