కాలుష్యరహిత నగరంగా ఫ్యూచర్‌సిటీ
` నెట్‌జీరో సిటీగా నిర్మించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం
` డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క వెల్లడి
హైదరాబాద్(జనంసాక్షి): ఫ్యూచర్ సిటీని నెట్‌జీరో సిటీగా నిర్మించాలనేది ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఐజీబీసీ ఆధ్వర్యంలో నోవాటెల్‌లో నిర్వహిస్తున్న గ్రీన్ తెలంగాణ సమ్మిట్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ‘ప్రపంచానికే ఆదర్శంగా ఉండేలా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తాం. ప్రభుత్వ అంకితభావం చాటిచెప్పడానికే ఐజీబీసీతో ఫ్యూచర్ సిటీపై ఎంఓయూ కుదుర్చు కున్నాం. రాష్టాభ్రివృద్ధి, అన్ని వర్గాల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు ఉంటాయి. పర్యావరణ పరిరక్షణ కోసం ఇప్పటికే కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచేలా మినహాయింపునిచ్చాం. రాష్ట్ర ఆదాయం తగ్గుతుందని తెలిసినా.. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈవీ పాలసీ తీసుకొచ్చాం. హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలను మరింత పెంచేలా రూ.10 వేల కోట్లను కేటాయించాం. మూసీ సుందరీకరణ చేపట్టాం. ఇతర రాష్టాల్రతో పోలిస్తే తెలంగాణలో స్థిరాస్తి రంగం ఆశించిన స్థాయిలో ఉంది. స్థిరాస్తి వ్యాపారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది‘ అని భట్టి అన్నారు.
ఎన్నికలకోడ్ లేని జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించండి
` ప్రభుత్వ భూముల సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టండి
` లఘు చిత్రాలకు ప్రజా ప్రభుత్వం ప్రోత్సాహం
` శాట్ లైట్ టౌన్ షిప్ నిర్మాణాలపై హౌజింగ్ శాఖ దృష్టి సారించాలి
` ఎల్‌ఐజి, ఎంఐజి, హెచ్‌ఐజి ఇండ్ల నిర్మాణంతోమధ్యతరగతి ప్రజల సొంతింటి కల సాకారం
` డిజిటల్ భూ సర్వేకు అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలి
` ప్రభుత్వ కార్యాలయాల భవనాలపై సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకోవాలి
` డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క మల్లు బడ్జెట్ సమీక్ష
` సమావేశానికి హాజరైన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేనటువంటి ఉమ్మడి మహబూబ్నగర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హౌజింగ్ అధికారులకు సూచించారు. శనివారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో రెవిన్యూ, హౌసింగ్, ఐడపిఆర్ ఉన్నత అధికారులతో 2025`26 బడ్జెట్ ప్రతిపాదనలపై మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లతో కలిసి సవిూక్షించారు. రాష్ట్రంలో ఇండ్లు లేని పేదలకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇండ్లు నిర్మించి ఇవ్వడానికి ఈ ఏడు ప్రతి నియోజకవర్గంలో 3500 ఇండ్ల చొప్పున బడ్జెట్‌లో నిధులు కేటాయించిందన్నారు. ప్రభుత్వం అమలు చేసే ఆరు గ్యారంటీల అమలులో భాగమే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణమన్నారు. వివాదాల కారణంగా కోర్టు కేసుల్లో ఉన్న ప్రభుత్వ భూములు సాధించుకోవడానికి కావలసిన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. జిపి, ఏజీపీలతో ప్రభుత్వ భూవివాద కేసులకు సంబంధించి నిరంతరం మానిటరింగ్ చేయాలన్నారు. కోట్ల రూపాయల విలువైన భూములు ప్రభుత్వానికి దక్కే విధంగా ప్రత్యేక దృష్టి పెట్టాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. సినిమా కళాకారులను ప్రోత్సహించడంతో పాటు సమాజ వికాసానికి దోహదపడే విధంగా లఘు చిత్రాలను తీసుకురావడానికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం ఆలోచనలను, ప్రభుత్వ పథకాలను లఘు చిత్రాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయడానికి కావలసిన చర్యలు తీసుకోవాలని సమాచార శాఖ అధికారులకు సూచించారు. రాష్ట్ర రాజధాని హైదరబాద్ మహానగరం శరవేగంగా అభివృద్ది చెందుతున్న నేపథ్యంలో ఆవుటర్, రీజినల్ రింగ్ రోడ్డు చుట్టూ పేద, మధ్యతరగతి ప్రజల కోసం శాట్ లైట్ టౌన్ షిప్ నిర్మాణాలపై హౌజింగ్ శాఖ దృష్టి సారించాలన్నారు. హైదరాబాద్ మహానగరంలో మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేయడానికి ఎల్‌ఐజి, ఎంఐజి, హెచ్‌ఐజి ఇండ్ల నిర్మాణానికి అనువైన ప్రాంతాలను గుర్తించి, కావాల్సిన భూమి కొరకు రెవెన్యూ శాఖకు ప్రతిపాదనలు పంపించి భూమిని సేకరించుకోవాలన్నారు. గత ప్రభుత్వాలు ఎస్‌ఆర్ నగర్, బర్కత్‌పుర, కూకట్‌పల్లి, ఈసిఐఎల్ లాంటి ప్రాంతాల్లో హౌజింగ్ బోర్డు ఆధ్వర్యంలో ఎల్‌ఐజి, ఎంఐజి, హెచ్‌ఐజి పేరిట ఇండ్ల నిర్మాణాలు చేయడం వల్ల ఎంతో మంది మధ్యతరగతి ప్రజలకు సొంతింటి కల నెరవేరిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. డిజిటల్ భూ సర్వేకు సంబంధించి ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కార్యాలయాల జాబితాను సేకరించి, ప్రతి నెల అద్దె చెల్లించడానికి ఆర్థిక శాఖలో ప్రత్యేకంగా ఒక సెక్షన్ ను ఏర్పాటు చేయాలన్నారు. కాలుష్యం లేనటువంటి గ్రీన్ ఎనర్జీని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నందున అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాల భవనాలపై సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సంపద సృష్టించి ఆ సంపదను ఈ రాష్ట్ర ప్రజలకు పంచడమే ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం లక్ష్యమని, ఈ లక్ష్యానికి అనుగుణంగా అధికారులు ప్రత్యామ్నాయ వనరులను సవిూకరించడంలో ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. ఈ సమావేశంలో ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, రెవిన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్, రెవిన్యూ సెక్రెటరీ జ్యోతి బుద్ధ ప్రకాష్, హౌసింగ్ ఎండి గౌతమ్. ఐడపిఆర్ కమిషనర్ హరీష్ తదితరులు పాల్గొన్నారు.