కాలుష్య కోరల్లో ఢిల్లీ

– ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరం ఢిల్లీ
– అత్యంత కాలుష్యపూరితమైన 20 నగరాల్లో 14భారత్‌లోనే
– ప్రపంచంలో కాలుష్యపూరితమైన గాలిని పీల్చుతున్న 90శాతం మంది
– ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి
న్యూఢిల్లీ,మే2( జ‌నం సాక్షి): ఢిల్లీ కాలుష్యం మరోమారు వార్తల్లోకి ఎక్కింది.విషయంలో దేశ రాజధాని నగరం ఢిల్లీ అపఖ్యాతి మూటగట్టుకుంది. ప్రపంచం మొత్తంలోనే అత్యంత కాలుష్యం నగరం ఢిల్లీనే అని ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన వివరాల ద్వారా వెల్లడైంది. ప్రపంచంలో అత్యంత కాలుష్యపూరితమైన 20 నగరాల జాబితాలో 14 భారత్‌లోనే ఉన్నాయి. ఢిల్లీ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉండగా, ముంబయి నాలుగో స్థానంలో ఉంది. ఈజిప్టులోని గ్రేటర్‌ కైరో కాలుష్య నగరాల్లో రెండో స్థానంలో ఉండగా, మూడో స్థానంలో బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా, అయిదో స్థానంలో చైనా రాజధాని బీజింగ్‌ ఉంది. 14 మిలియన్ల కంటే అధిక జనాభా ఉన్న నగరాల్లో కాలుష్యంపై డబ్ల్యుహెచ్‌ఓ సర్వే చేపట్టింది. కాలుష్యం అధిక స్థాయిలో ఉండే బీజింగ్‌ కంటే కూడా మన దేశంలోని ముంబయి నగరం ముందు స్థానంలోకి వెళ్లడం గమనార్హం. కాలుష్య నగరాల జాబితాలో భారత్‌లో ఢిల్లీ, ముంబయి, గ్వాలియర్‌, వారణాసి, కాన్పూర్‌ సహా తదితర నగరాలు ఉన్నాయి. గాలిలోని పర్టిక్యులేట్‌ మాటర్‌(పీఎం) స్థాయిల ఆధారంగా కాలుష్యాన్ని అంచనా వేస్తారు. ప్రపంచంలో 90శాతం మంది ప్రజలు కాలుష్యపూరితమైన గాలిని పీలుస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. దీనివల్ల 2016లో 7 మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. పరిశ్రమలు, కార్లు, ట్రక్కులు కాలుష్యాన్ని మరింతగా పెంచుతున్నాయని వెల్లడించింది. బయటి కాలుష్యం వల్ల 4.2మిలియన్ల మంది చనిపోగా, ఇంటి లోపలి కాలుష్యం వల్ల 3.8మిలియన్ల మంది చనిపోయారని డబ్ల్యుహెచ్‌ఓ నివేదికలో వెల్లడైంది. భారత్‌లో బయట, ఇంటి కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోందని, చిన్న చిన్న నగరాలు, పట్టణాల్లో కూడా కాలుష్యం స్థాయిలు బాగా పెరుగుతున్నాయి. ఆసియా దేశాలు, ఆఫ్రికా దేశాల్లో సగటున కాలుష్యం వల్ల మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటోందని డబ్ల్యుహెచ్‌ఓ నివేదికలో వెల్లడించింది. నాలుగో వంతు మరణాలు గుండె జబ్బుల వల్ల, గుండె పోటు, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ తదితర జబ్బులతో చనిపోతున్నారని తెలిపింది. దిల్లీలో గాలిలో అత్యంత ప్రమాదకరమైన కాలుష్య కణాలు ఉంటున్నాయని, సేఫ్‌ లిమిట్‌కు పది రెట్లు అధికంగా కాలుష్యం ఉందని డబ్ల్యుహెచ్‌ఓ వెల్లడించింది. చాలా సంవత్సరాలుగా ఢిల్లీలో కాలుష్యం రోజు రోజుకూ పెరిగిపోతున్నప్పటికీ చాలా తక్కువ మంది మాత్రమే కాలుష్య నియంత్రణకు ప్రయత్నిస్తున్నారని సామాజిక కార్యకర్తలు చెప్తున్నారు. గత ఏడాది నవంబరులో ఢిల్లీలో కాలుష్యంతో కూడిన పొగమంచు నగరాన్ని కమ్మేయడంతో మెడికల్‌ అసోసియేషన్‌ వెంటనే నగరంలో ఆరోగ్య అత్యవసర స్థితి ప్రకటించాల్సి వచ్చింది. నగరవాసులను ఇంట్లో నుంచి బయటకు రావొద్దని సూచించింది. పాఠశాలలు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఈ ఏడాది జనవరిలో కూడా సుప్రీంకోర్టు ఢిల్లీలో కాలుష్యాన్ని నివారించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది.