కాల్‌మనీ దుర్మార్గులను హతమారుస్తాం
– అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి శిక్ష తప్పదు
– మావోయిస్టు పార్టీ హెచ్చరిక
హైదరాబాద్,డిసెంబర్28(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మావోయిస్టులు సోమవారం బహిరంగ లేఖ రాశారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ నిందితులను ప్రభుత్వం రక్షిస్తోందని ఆరోపించారు. కాల్ మనీ బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే ప్రజాకోర్టులో శిక్ష తప్పదని లేఖలో మావోయిస్టులు హెచ్చరించారు. కాల్ మనీ నిందితులను రక్షించడంలో ప్రభుత్వం, పోలీసులు తలమునలై ఉన్నారని ఆరోపించారు. వడ్డీల పేరుతో వేధించి మహిళలను బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపిన టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను కాపాడుకోవడానికి చంద్రబాబు నక్కజిత్తుల వేషాలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ దురాగతాన్ని మరుగున పరచడమే లక్ష్యంగా చంద్రబాబు సర్కారు పనిచేస్తోందని మండిపడ్డారు. వేతనాల పెంపు కోసం ‘ఛలో విజయవాడ’ కార్యక్రమంలో పాల్గొన్న అంగన్ వాడీ మహిళలను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పెద్ద డ్రామాగా మావోయిస్టులు వర్ణించారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ పై ప్రజలను, రాజకీయ పార్టీలను పక్కదారి పట్టించేందుకు ఇదంతా చేశారని ఆరోపించారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ దోషులకు శిక్షించే వరకు పోరాడాలని ప్రజలు, రాజకీయ పార్టీలు, మహిళా సంఘాలకు పిలుపునిచ్చారు. కాల్ మనీ బాధ్యులపై కఠిన శిక్షలు తీసుకోకుంటే ప్రజాకోర్టులో వారికి శిక్ష తప్పదన్నారు. సెక్స్ రాకెట్ దుర్మార్గులను ప్రజాకోర్టులో హతమారుస్తామని హెచ్చరించారు.