కాళేశ్వరం, భద్రాద్రి వద్ద గోదావరి ఉరకలు
వరద ఉధృతి మరింతగా పెరిగే అవకాశాలు
వర్షం తగ్గుముఖం పట్టినా కొనసాగుతున్న వరద
హైదరాబాద్,ఆగస్ట్14(జనం సాక్షి): తెలంగాణ, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద నీటి ప్రవాహ ఉద్ధృతి కొనసాగుతోంది. గోదావరి, ప్రాణహిత నదుల్లోకి భారీగా వరద వచ్చిచేరుతోంది. ఎల్లంపల్లి గేట్లు ఎత్తివేసి 2,89,000 క్యూసెకుల నీటి విడుదల చేయడంతో గోదావరి ప్రవాహం భారీగా ఉంది. వరద నీరు పుష్కర ఘాట్లను తాకుతూ ప్రవహిస్తోంది. గోదావరి, ప్రాణహిత నదులు నిండుగా ఉండడంతో భక్తులు, యాత్రికులు, చూడడానికి తరలివస్తున్నారు. తెలంగాణ, మహారాష్ట్రలను సమన్వయం చేసే అంతరాష్ట్ర వంతెన వద్ద వరద ఉద్ధృతి కనువిందు చేస్తోంది. వాజేడులోని బొగత జలపాతం నీటి ఉద్ధృతితో ఉప్పొంగుతూ ఉరకలేస్తోంది. జలపాతం నీటితో నిండుగా జలశోభ సంతరించుకుంది. వాజేడులో రాత్రి నుంచి కురుస్తున్న వానతో మిరప రైతులకు నష్టం కలిగించింది. వాజేడు మండలంలోని పూసూరు వంతెన వద్ద గోదావరి నిండునిండుగా ప్రవహిస్తోంది. పోటెత్తిన వరదనీటితో ఎరుపురంగును పులుముకొని పరవళ్లు తొక్కుతోంది. పేరూరు తీరంవద్ద వరద ప్రవాహం ఉదయం 36 అడుగులుగా నమోదైంది. సాయంత్రానికి క్రమంగా తగ్గి 32 అడుగులకు చేరుకుంది. కాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సోమవారం వర్షం తగ్గుముఖం పట్టింది. మరోవైపు ఎగువన కురుస్తున్న వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి క్రమేపీ పెరుగుతోంది. ఇది మరికొంత పెరిగే అవకాశం ఉన్నట్లు కేంద్ర జలసంఘం అధికారులు పేర్కొంటున్నారు.భారీ వర్షాల కారణంగా గోదావరి నదికి వరదనీరు పోటెత్తింది. భద్రాచలం వద్ద వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 38 అడుగులకు చేరింది. నీటి మట్టం 43 అడుగులు దాటితే మొదటి ప్రమాద హెచ్చరికను చేస్తామని అధికారులు తెలిపారు. గోదావరికి వరదనీరు పోటెత్తడంతో పోలవరం వద్ద పనులు నిలిచిపోయాయి. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అయితే గత రెండు రోజులతో పోల్చితే వాన జోరు తగ్గింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇప్పటికే కురిసిన వర్షంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో కిన్నెరసాని, మల్లన్నవాగు, నడివాగు, దున్నపోతుల వాగు, ఏడు మెలికల వాగులు పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. చర్లలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుండటంతో ఎనిమిది గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. పలు గ్రామాల్లో చెరువులు అలుగు పారుతున్నాయి. వరద ఉధృతికి రోడ్లు కొట్టుకుపోయాయి. వందలాది ఎకరాల్లో వరి, పత్తి, మిరప చేలకు నష్టం వాటిల్లింది. కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు ఏరియాల్లోని ఓపెన్ కాస్ట్ గనుల్లో నీరు చేరడంతో మూడు రోజులుగా సుమారు 1.50 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. ఇక ఖమ్మం జిల్లాలో జల్లులతో కూడిన వర్షం కురిసింది. వైరా రిజర్వాయర్‌లో 18.3 అడుగులు సాధారణ నీటిమ్టటం కాగా.. 19అడుగుల వద్ద అలుగు పోస్తోంది. పాలేరు రిజర్వాయర్ నీటిమట్టం 23 అడుగులు కాగా ప్రస్తుతం 17.5 అడుగులకు చేరుకుంది. నిర్మల్ జిల్లాలో సోమవారం 2.5 మిల్లీ విూటర్ల వర్షపాతం నమోదైంది. కడెం ప్రాజెక్ట్ నీటిమట్టం 700 అడుగులకుగాను ప్రస్తుతం 697.575 అడుగులకు చేరుకుంది. అయితే ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద తగ్గుముఖం పట్టింది.
——————



