కాళేశ్వరానికి జలశక్తి అనుమతులు

సొంత నిధులతోనే నిర్మించిన తెలంగాణ
ఉత్తమ్‌ ప్రశ్నకు కేంద్రమంత్రి షెకావత్‌ జవాబు
న్యూఢల్లీి,డిసెంబర్‌16 (జనం సాక్షి)  : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర జలశక్తి శాఖ సలహామండలి అనుమతి వుందని ఆ శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వమే సొంత నిధులతో కట్టుకుంటోదని ఆయన తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్వ పరాల గురించి లోక్‌ సభలో కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అడిగిన ప్రశ్నలకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వమే తన సొంత వనరుల ద్వారా నిర్మించిందని, ఇప్పటివరకు 83.7 శాతం ప్రాజెక్టు పనులు పూర్తి అయ్యాయని వివరించారు. ఈ ప్రాజెక్టు కింద 18లక్షల 25వేల 700 ఎకరాలకు కొత్తగా సాగునీరు, మరో 18లక్షల 82వేల 970 ఎకరాల స్తిరీకరణ జరుగుతుందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 240 టీఎంసీల నీటిని ఎత్తిపోసి సరఫరా చేసేందుకు నిర్మిస్తున్నారని వివరించారు. ఈ ప్రాజెక్టు కింద కరీంనగర్‌ , రాజన్నసిరిసిల్ల, మెదక్‌, యాదాద్రి భువనగిరి, నల్గొండ, సంగారెడ్డి, నిజామాబాద్‌, జగిత్యాల్‌ , కామారెడ్డి, నిర్మల్‌, మేడ్చేల్‌, పెద్ద పల్లి జిల్లాల్లో భూములు కొత్తగా సాగులోకి తెచ్చే ప్రతిపాదనతో ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని, ప్రాజెక్టుకు ఇప్పటివరకు 80 వేల 321.57 కోట్లు ఖర్చు అయిందని తెలిపారు. వివిధ ప్రభుత్వ
రంగ బ్యాంకులు ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు సమకూర్చాయని పేర్కొన్నారు.