కావలిలో పాఠశాల కరస్పాండెంట్ దారుణ హత్య
నెల్లూరు, జూన్ 27 : కావలి పట్టణంలోని కో ఆపరేటివ్ కాలనీలో గీతాంజలి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నడుపుతున్న మేక యానాదిరెడ్డి (48) మంగళవారం సాయంత్రం దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యకు కారణాలు తెలియరాలేదు. ఈ హత్యలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఎస్.కె రియాజ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. రియాజ్ కావలి పట్టణంలోని ఓ బట్టల దుకాణంలో సెల్స్‌మెన్‌గా పని చేస్తున్నాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం సాయంత్రం యానాదిరెడ్డి తన అపార్ట్‌మెంట్‌లో ఉండగా రియాజ్, మరో ఇద్దరుతో కలిసి ఆపార్ట్‌మెంట్‌లోకిి మారణాయుధాలతో ప్రవేశించి విచక్షణారహితంగా పొడవడంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. ఈ సంఘటన గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో రియాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కావలి రెండవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.