కాశ్మీర్‌కు వైద్య బృందం పంపండి
– భాష్పవాయుగోళాలతో అట్టుడుకుతోంది
– ఫరూక్ అబ్దుల్లా
శ్రీనగర్,జులై 13(జనంసాక్షి):కశ్మీర్ లోయలో కొనసాగుతున్న అల్లర్లలో తీవ్రంగా గాయపడిన వారికి చికిత్స అందించేందుకు డాక్టర్ల బృందాన్ని పంపాలని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కోరారు. ఇటీవలి పోలీసుల బాష్పవాయు ప్రయోగం వల్ల కొందరు యువకులు తమ కంటి చూపును కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. బుధవారం కశ్మీర్ అశాంతిపై.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీలను లక్ష్యంగా చేసుకొని ఆయన వరుస ట్వీట్లు చేశారు. గాయపడిన యువకులకు వైద్య సేవలు అందించడానికి మోదీ డాక్టర్ల బృందాన్ని పంపించాలని ఆయన కోరారు. కేరళ కొల్లాం ఆలయంలో అగ్నిప్రమాదం సంభవించినప్పుడు.. మోదీ డాక్టర్ల బృందాన్ని వెంట తీసుకెళ్లిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇప్పుడు కూడా ప్రధాని కంటి డాక్టర్ల బృందాన్ని కశ్మీర్ లోయకు పంపాలని ఆయన కోరారు. భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 1200 మందికి పైగా యువత తీవ్రంగా గాయపడ్డారని వారికి సరైన వైద్యం అందటంలేదని ఒమర్ పేర్కొన్నారు.